Site icon NTV Telugu

Priyanka Gandhi: వయనాడ్ నుంచి ప్రియాంకా గాంధీ పోటీ..?

Priyanka Gandhi

Priyanka Gandhi

Priyanka Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. అయితే, అతను ఏ స్థానాన్ని నిలబెట్టుకుంటారు..? ఏ స్థానాన్ని వదిలేస్తారనేది ఉత్కంఠగా మారింది. ఈ రెండు స్థానాల నుంచి భారీ మెజారిటీతో రాహుల్ గాంధీ గెలుపొందారు. ఇదిలా ఉంటే ఈ విషయంపై తాను ఏం తేల్చుకోలేకపోతున్నానని ఆయన అన్నారు. చాలా మంది అనుకుంటున్నట్లు ఆయన ఉత్తర్ ప్రదేశ్‌లోని గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీనే నిలుపుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Read Also: AP Crime: వైన్స్‌ దగ్గర గొడవ.. ఒకరి హత్య

ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఓ వార్త హల్చల్ చేస్తోంది. వయనాడ్ ఎంపీగా రాహుల్ గాంధీ రాజీనామా చేస్తే ఆ స్థానం నుంచి ప్రియాంకాగాంధీ పోటీ చేస్తారని తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ అమేథీ లేకుంటా వారణాసి నుంచి ప్రధాని నరేంద్రమోడీకి ప్రత్యర్థిగా పోటీ చేస్తాననే వార్తలు వినిపించినప్పటికీ, ఆమె ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఇటీవల రాహుల్ గాంధీ యూపీలో ‘ధన్యవాదయాత్ర’లో మాట్లాడుతూ.. తన చెల్లి వారణాసి నుంచి పోటీ చేస్తే 2-3 లక్షల మెజారిటీతో ప్రధానిని ఓడించే వారని వ్యాఖ్యానించారు.

వయనాడ్‌ని వదులుకోవద్దని కేరళ కాంగ్రెస్ నేతలు రాహుల్‌ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాయ్‌బరేలీని నిలబెట్టుకుని, వయనాడ్ నుంచి ప్రియాంకాగాంధీని బరిలోకి దింపే అవకాశం కనిపిస్తోంది. 2019లో అమేథీ నుంచి ఓడిపోయినప్పుడు రాహుల్ గాంధీని ఎంపీగా చేసింది వయనాడ్. మరోవైపు ఈ సారి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ-కాంగ్రెస్ కూటమి సత్తా చాటింది. బీజేపీకి కంచుకోటగా ఉన్న యూపీలోని 80 స్థానాల్లో 43 స్థానాలను ఇండియా కూటమి గెలిచింది. కాంగ్రెస్ 6 చోట్ల విజయం సాధించింది. దేశంలో అధికారంలో చేపట్టాలంటే ఈ రాష్ట్రం కీలకం కావడంతో రాహుల్ గాంధీ రాయ్‌బరేలీని నిలబెట్టుకుంటారనే వాదన కూడా ఉంది.

Exit mobile version