పార్లమెంట్‌లో గురువారం ఎంపీల మధ్య కొట్లాట జరిగింది. అయితే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తోసేయడం కారణంగా బీజేపీ ఎంపీ గాయపడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ నేత హేమాంగ్ జోషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాహుల్‌గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. పార్లమెంట్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు… తాజాగా క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేయబడింది. అలాగే కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీ నేతలపై ఫిర్యాదు చేశారు. బీజేపీ నేతలు కర్రలతో దాడి చేశారని.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే గాయపడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా పరస్పరం ఇరువర్గాలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకున్నాయి. రాహల్‌పై నమోదైన కేసును ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేపట్టారు.
ఇది కూడా చదవండి: Telangana Bhu Bharati: భూ భారతి బిల్లుకు ఆమోదం..
గురువారం జరిగిన ఘటనలో ఇద్దరు బీజేపీ ఎంపీలకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిలో బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి నుదిటిపై గాయాలయ్యాయి. ఈ గొడవ తర్వాత బీజేపీ నేత హేమాంగ్ జోషి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను బీజేపీ సభ్యులు నెట్టారని, ఆ తర్వాత ఆయన మోకాలికి గాయమైందని ఆరోపిస్తూ, గందరగోళానికి బీజేపీ కారణమని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ ఎంపీలు లాఠీ చేతబట్టి తనను పార్లమెంటులోకి రానీయకుండా అడ్డుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
ఇక ఈ నిరసనల సమయంలో రాహుల్‌గాంధీ తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని బీజేపీ మహిళా ఎంపీ ఫాంగ్నోన్ కొన్యాక్ ఆరోపించారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామం తనను ఎంతగానో బాధించిందని.. రాహుల్ తనకు చాలా దగ్గర నిలబడడం తన మనసు కలిచివేసిందని ఆరోపించారు. అంతేకాకుండా తనపై గట్టిగా కూడా అరిచారని ఆవేదన చెందారు.
ఇది కూడా చదవండి: Nitish Kumar: నితీష్ కుమార్ నేతృత్వంలోనే బీహార్ ఎన్నికలు..క్లారిటీ ఇచ్చిన ఎన్డీయే..