నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సోమవారం నాలుగోరోజు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. దాదాపు 12 గంటలపాటు ఈడీ ఆయనను సుదీర్ఘంగా విచారించింది. జూన్ 13, 14, 15 తేదీల్లో రాహుల్‌ను 30 గంటలకు పైగా ఈడీ లోతుగా విచారించడం తెలిసిందే. గత వారంలో వరుసగా మూడు రోజులు ఈడీ ప్రశ్నల పరంపరను ఎదుర్కొన్న రాహుల్.. సోమవారమూ హాజరయ్యారు. ఉదయం 11 గంటల సమయంలో ఈడీ ప్రధాన కార్యాలయానికి రాహుల్ చేరుకున్నారు. విచారణ అనంతరం అర్ధరాత్రి 12.30 దాటిన తర్వాతే ఆయన ఇంటికి తిరిగివెళ్లారు. దీంతో మొత్తం 40 గంటలకు పైగా ఆయన విచారణను ఎదుర్కొన్నారు.
విచారణ సమయంలో హెరాల్డ్ కేసులో అక్రమ నగదు చలామణిపై కొన్ని కీలక ప్రశ్నలను ఈడీ సంధించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అసోసియేటెడ్ జర్నల్, యంగ్ ఇండియా లిమిటెడ్ బోర్డు సమావేశాల గురించి ప్రశ్నించింది. ఇంకా చాలా ప్రశ్నలున్నాయని పేర్కొంటూ.. మంగళవారం మళ్లీ రావాలని ఈడీ ఆదేశించింది. రాహుల్‌ను ఈడీ పిలిచినప్పటి నుంచి ఢిల్లీలో భారీస్థాయిలో సత్యాగ్రహం నిర్వహిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు సోమవారమూ.. జంతర్ మంతర్ దగ్గర తీవ్రస్థాయిలో ఆందోళనలు చేశారు. అగ్నిపథ్ పథకాన్ని కూడా వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.
16న కూడా విచారణ జరగాల్సి ఉండగా రాహుల్ అభ్యర్థన మేరకు ఈడీ ఒక్క రోజు విరామమిచ్చింది. ఆస్పత్రిలో ఉన్న తన తల్లి సోనియాగాంధీ బాగోగులు చూసుకోవాల్సి ఉందని కోరడంతో సోమవారానికి వాయిదా వేసింది. కాంగ్రెస్ నిరసనల నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్ద భద్రతా దళాలు భారీగా మోహరించాయి. ఈ కేసులో సోనియాను కూడా 23న ఈడీ విచారణకు పిలవడం తెలిసిందే. యంగ్ ఇండియన్, ఏజేఎల్, నేషనల్ హెరాల్డ్ వ్యవహారాల్లో రాహుల్ కీలక వ్యక్తి గనుక ఆయన వాంగ్మూలం చాలా కీలకమని ఈడీ వర్గాలు అంటున్నాయి.
Congress: రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ నేతలు.. వాటిపై ఫిర్యాదు