ఓట్ల చోరీపై కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై మరో బాంబ్ పేల్చారు. ఉద్దేశపూర్వకంగా లక్షల ఓట్లను ఎన్నికల సంఘం తొలగించిందని తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియా ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వారిని ఈసీనే కాపాడుతోందని ఆరోపించారు. తాను చేసే ఆరోపణలకు 100 శాతం ఆధారాలు ఉన్నాయని ప్రకటించారు. ఫేక్ అఫ్లికేషన్లు ఫైల్ చేశారని.. ఫేక్ లాగిన ఐడీతో ఓటర్ల పేర్లను డిలీట్ చేశారని వీడియో వేసి చూపించారు. కేవలం కాంగ్రెస్‌కు బలమున్న చోటే ఓట్లు తొలగించారని ధ్వజమెత్తారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా వేల ఓట్లు తొలగించారని.. కర్ణాటకలో ఓట్లు తొలగించేందుకు వేరే మొబైల్ నెంబర్లు ఉపయోగించారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Delhi: పాక్-సౌదీ రక్షణ ఒప్పందంపై స్పందించిన భారత్
భారతదేశమంతటా లక్షలాది ఓట్లను తొలగించాలని కొంత మంది వ్యక్తులు లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. ఈరోజు హైడ్రోజన్ బాంబ్ సాక్ష్యాలను వదులుతున్నట్లు పేర్కొన్నారు. ఇదంతా ఎలా జరుగుతుందో 100 శాతం రుజువులు దొరికాయని వెల్లడించారు. ఈ వేదికపై 100 శాతం రుజువు లేకుండా తానేమీ మాట్లాడడం లేదన్నారు. కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో ఎవరో 6,018 ఓట్లను తొలగించడానికి ప్రయత్నించారని.. చివరికి ఎవరో పట్టుబడ్డారన్నారు. ఇది చాలా నేరాల మాదిరిగానే యాదృచ్చికంగా పట్టుబడినట్లు తెలిపారు. ఈ తొలగింపు ప్రయత్నాలు కేవలం కాంగ్రెస్ పార్టీ గెలిచే బూత్‌ల్లోనే జరిగిందని వివరించారు. గోదాబాయి పేరుతో ఎవరో నకిలీ లాగిన్ సృష్టించి 12 మంది ఓటర్ల పేర్లు తొలగించారన్నారు. కానీ ఈ విషయం గోదాబాయికి తెలియదని చెప్పారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఫోన్ నెంబర్ల ద్వారా ఈ తతాంగం అంతా చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.