Site icon NTV Telugu

Rahul Gandhi: దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే బీజేపీ, ఆర్ఎస్ఎస్ పని

Bharat Jodo Yatra

Bharat Jodo Yatra

Rahul Gandhi criticizes BJP and RSS: భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక బళ్లారిలో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీజేపీపై ధ్వజమెత్తారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే బీజేపీ, ఆర్ఎస్ఎస్ పని అన్నారు. బీజేపీ దేశంలోని ప్రజలను విడదీస్తుందని చాలా మంది ప్రజలు అనుకుంటున్న నేపథ్యంలోనే ఈ యాత్రకు ‘ భారత్ జోడో యాత్ర’ అని పేరు పెట్టినట్లు తెలిపారు. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారిలో ప్రారంభం అయిన యాత్ర 38వ రోజుకు చేరుకుంది. శనివారం నాటికి రాహుల్ గాంధీ పాదయాత్ర 1000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది.

Read Also: Palle Ravikumar : కాంగ్రెస్‌కు షాక్‌.. టీఆర్‌ఎస్‌లోకి పల్లె రవి దంపతులు

భారతదేశంలో గత 45 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా నిరుద్యోగాన్ని ఎదుర్కొంటోందని రాహుల్ గాంధీ అన్నారు. ప్రతీ ఏడాది 2 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని ప్రధాని మోదీ చెప్పారని..అయితే ఆ ఉద్యోగాలన్నీ ఎక్కడి పోయాయని ప్రశ్నించారు. కోట్లాది మంది యువత నిరుద్యోగులుగా మారారని అన్నారు. కర్ణాటకలో 2.5 లక్షల ప్రభుత్వ పోస్టులు ఎందుకు ఖాళీగా ఉన్నాయని అని ప్రశ్నించారు. పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ కావాలంటే రూ.80 లక్షలు చెల్లించి కావచ్చని.. డబ్బుంటే కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగాన్ని కొనుక్కొవచ్చని ఆరోపించారు. డబ్బు లేకుంటే మీరంతా జీవితాంతం నిరుద్యోగులుగా ఉండాల్సిందే అని గాంధీ కర్ణాటక ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన రాహుల్ గాంధీ ‘ భారత్ జోడో యాత్ర’ తమిళనాడు, కేరళ రాష్ట్రాల మీదుగా కర్ణాటకకు చేరుకుంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ పాదయాత్ర కర్ణాటకలో సాగుతోంది. 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీ ఈ భారీ యాత్రకు రూపకల్పన చేసింది. 5 నెలల పాటు 3570 కిలోమీటర్ల మేర 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా ఈ యాత్ర సాగనుంది. కర్ణాటక తరువాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా ఈ యాత్ర సాగనుంది. కన్యాకుమారిలో ప్రారంభం అయిన ఈ పాదయాత్ర కాశ్మీర్ లో ముగియనుంది.

Exit mobile version