Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం

  • మహిళలపై ఆగని అకృత్యాలు
  • పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య
  • కాలువలో శవం లభ్యం
Inder Kaur

Inder Kaur

ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మహిళలపై అకృత్యాలు, ఘోరాలు ఆగడం లేదు. ఎక్కడొక చోట అబలలు మృగాళ్ల చేతిలో బలైపోతున్నారు. ఈ మధ్య వరుసగా వరకట్న పిశాచికి గృహిణిలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దారుణాలను మరువక ముందే.. తాజాగా పంజాబ్‌లో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ పంజాబీ గాయని ఇందర్ కౌర్ దారుణ హత్యకు గురైంది. పెళ్లికి అంగీకరించలేదని ఓ మృగాడు అత్యంత దారుణంగా చంపేసి మృతదేహాన్ని కాలువలో పడేశారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

ఇందర్ కౌర్.. ప్రముఖ పంజాబ్ గాయని. మోగాలోని భలూర్ గ్రామానికి చెందిన సుఖ్వీందర్ సింగ్ అనే వ్యక్తి బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి తీవ్ర ఒత్తిడి తెస్తున్నాడు. కానీ అందుకు ఇందర్ కౌర్ నిరాకరిస్తూ వస్తోంది. దీంతో సుఖ్వీందర్ సింగ్ పగ పెంచుకున్నాడు. ఈ నెల 13న రాత్రి 8:30 గంటలకు కారులో సరుకులు తేవడానికి ఇందర్ కౌర్ బయటకు వెళ్లింది. రాత్రి పొద్దుపోయే వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు భయాందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో బాధిత కుటుంబం సుఖ్వీందర్ సింగ్‌పై అనుమానం వ్యక్తం చేశారు. కెనడా నుంచి పంజాబ్‌కు వచ్చి కిడ్నాప్ చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. చివరికి అనుమానం నిజమైంది. ఇందర్ కౌర్‌ను చంపేసి మృతదేహాన్ని కాలువలో పడేశాడు. అనంతరం నిందితుడు కెనడాకు పారిపోయాడు.

ఇక మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె చనిపోయిందంటూ తల్లిదండ్రులు భోరన విలపించారు. మే 15న సుఖ్వీందర్ సింగ్, అతని సహచరుడు కరమ్‌జిత్ సింగ్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పటికీ.. సకాలంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసు బృందాలు దాడులు నిర్వహిస్తున్నాయని జమాల్‌పూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ బల్బీర్ సింగ్ తెలిపారు.