Paper Leaks: దేశ వ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యువత భారీ ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. పేపర్ లీక్‌కు కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉద్యమానికి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) , ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మద్దతుగా నిలుస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఇదే సమయంలో ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్‌లో పేపర్ లీక్ వ్యవహారం సంచలనంగా మారింది. రాష్ట్రంలో జరుగుతున్న వరస పేపర్ లీక్ వ్యవహారంపై కాంగ్రెస్, బీజేపీ భగ్గుమంటోంది. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమ్రిందర్ సింగ్ రాజా వారింగ్ మాట్లాడుతూ..పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ సీఎం భగవంత్ మాన్, విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా జరిగిన పేపర్ లీక్‌లకు ప్రధాని నరేంద్రమోడీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఎలా బాధ్యత వహించాలో, అదే విధంగా పంజాబ్‌లో సీఎం, మంత్రి కూడా బాధ్యత వహించాలని అన్నారు.
ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా గతంలో పంజాబ్‌లో పేపర్ లీక్ జరిగినా సంబంధిత మంత్రి రాజీనామా చేయాల్సిందే అని చెప్పిన విషయాన్ని కాంగ్రెస్ నేత గుర్తుచేశారు. పంజాబ్ గ్రూప్-బీ పరీక్ష పేపర్ లీక్ అయి ఆరు నెలలు అవుతోంది, అంతకుముందు 12వ తరగతి ఇంగ్లీష్ పేపర్, ఫార్మాసిస్ట్ నియామక పరీక్ష పేపర్లు కూడా లీక్ అయ్యాయని అన్నారు. ఆప్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 ప్రధాన పేపర్ లీకులు జరిగాయని గుర్తుచేశారు. ఇప్పటి వరకు దీనిపై దర్యాప్తు లేదని, బాధ్యులపై చర్యలు లేవని అమ్రిందర్ సింగ్ అన్నారు.

