Punjab: పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం ‘‘లేని’’ శాఖకు మంత్రిని నియమించింది. గత 20 నెలలుగా మంత్రి ఆ శాఖను నడిపాడని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. పంజాబ్ మంత్రి వర్గంలో మంత్రిగా ఉన్న కుల్దీప్ సింగ్ ధాలివాల్ రెండు విభాగాలకు మంత్రికి పనిచేస్తున్నారు. ఇందులో ఒకటి మనుగడలోనే లేదు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వం దీనిని గమనించి, గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అవసరమైన సవరణలు చేయడానికి దాదాపుగా 20 నెలలు పట్టింది. మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్‌కి కేటాయించిన ‘‘పరిపాలన సంస్కరణల శాఖ’’ అసలు ఉనికిలోనే లేదని పంజాబ్ ప్రభుత్వం అంగీకరించింది. ప్రస్తుతం ధాలివాల్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖను మాత్రమే కలిగి ఉన్నారు.
Read Also: Hamas: మరో ఇద్దరు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసిన హమాస్
ధాలివాల్‌కి మొదటగా వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖను కేటాయించారు. అయితే, మే 2023లో జనవరిలో జరిగిన మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణలో ఆ బాధ్యతల నుంచి తొలగించబడ్డారు. ఆ తర్వాత ఆయనకు పరిపాలన సంస్కరణల శాఖను కేటాయించారు. అయితే, తాజాగా పంజాబ్ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. ఇప్పుడు పరిపాలన సంస్కరణల శాక ఉనికిలో లేదని పేర్కొంది.
అయితే, ఈ వ్యవహారంపై బీజేపీ, ఆప్ సర్కార్‌ని తీవ్రంగా విమర్శించింది. దాదాపుగా రెండేళ్లుగా ఉనికిలో లేని శాఖను ఒక మంత్రి ఎలా నిర్వహించారని ప్రశ్నించింది. ఆప్ పంజాబ్ పాలనను జోక్‌గా మార్చిందని, ఆప్ మంత్రి 20 నెలలుగా లేని శాఖను నడిపాడని, 20 నెలలుగా ఒక సీఎం లేని ఒక శాఖను నడుపుతున్నాడని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ అన్నారు. ఒక శాఖ లేదని తెలుసుకునేందుకు ఆప్ ప్రభుత్వానికి 20 నెలలు పట్టిందని దుయ్యబట్టారు. అరవింద్ కేజ్రీవాల్ ఒక మోసగాడు, ఆయన ప్రజా జీవితం నుంచి బహిష్కరించాలని బీజేపీ నేత అమిత్ మాలవీయ అన్నారు.