తమ అభిమాన నటుడు పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం తట్టుకోలేని అభిమానులు అనూహ్య ఘటనలకు పాల్పడుతున్నారు. పునీత్ రాజ్‌కుమార్ మరణవార్త విని పలువురు అభిమానులు గుండెపోటుకు గురికాగా మరికొందరు అభిమానులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కర్ణాటకలోని బెలగావి జిల్లాలో రాహుల్ అనే అభిమాని పునీత్ మరణ వార్త విన్న వెంటనే పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అటు రాయచూర్ జిల్లాలో కూడా ఇద్దరు పునీత్ అభిమానులు బసవ గౌడ్, మహ్మద్ రఫీ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఇద్దరిలో ఒకరు చనిపోయినట్లు తెలుస్తోంది.
Read Also: పునీత్ రాజ్ కుమార్ పార్థివదేహనికి ప్రముఖుల శ్రద్ధాంజలి
మరోవైపు చామరాజునగర్ జిల్లాకు చెందిన మునియప్ప అనే పునీత్ అభిమాని టీవీ చూస్తూ గుండెపోటుతో మరణించాడు. ఉడుపి జిల్లాలో సతీష్ అనే రిక్షా కార్మికుడు తన అభిమాన నటుడు పునీత్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తుండగా రిక్షాలోని కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అభిమాన నటులు చనిపోవడం బాధ కలిగించే విషయమే అయినా అభిమానులు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని పలువురు సినీ ప్రముఖులు సూచిస్తున్నారు. గుండె ధైర్యంతో మెలగాలని హితవు పలుకుతున్నారు.