ఆమె ట్రైనింగ్‌లో ఉన్న ఒక ఐఏఎస్. యూపీఎస్సీ పరీక్షల్లో ఆల్ ఇండియా 821 ర్యాంక్ సాధించింది. అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఆమె స్థాయికి తగ్గట్టుగా ఏర్పాట్లు ఉంటాయి. కానీ ఆమె మాత్రం అధికార దర్పం అనుభవించాలని ముచ్చట పడింది. ఊహా ప్రపంచంలో విహరించింది. ఇంకేముంది అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసేసుకుంది. ఈ యవ్వారం కాస్త ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో మూల్యం చెల్లించుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటుచేసుకుంది.
పూజ ఖేద్కర్ అనే ఒక మహిళా ప్రొబేషనరీ ఐఏఎస్.. పూణెలో అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ప్రొబేషనరీగా ఉన్నప్పుడు ఆమెకు సౌకర్యాలు ఉండవు. కానీ ఆమె మాత్రం అన్ని ఏర్పాట్లు చేసేసుకుంది. ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే ప్రైవేటు ఆడి కారు, పైన రెడ్-బ్లూ బీకన్ లైట్లు, మహారాష్ట్ర ప్రభుత్వం అని రాసి ఉన్న నేమ్‌బోర్డు పెట్టేసుకుంది. అంత మాత్రమే కాదు… వీటితో పాటు తనకు ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించాలని, తగినంత సిబ్బంది, కానిస్టేబుల్‌తో ఓ అధికారిక ఛాంబర్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.
ఇక అంతటితో ఆగకుండా అదనపు కలెక్టర్ అజయ్ మోర్ లేని సమయంలో ముందస్తు అనుమతి తీసుకోకుండా ఆయన ఛాంబర్‌లో ఆమె నేమ్‌ప్లేట్ పెట్టుకుని దాన్ని తన ఛాంబర్‌గా మార్చేసుకుంది. పాత కుర్చీలు, సోఫాలు, టేబుల్‌లతో సహా అన్ని మెటీరియల్‌లను తొలగించేసింది. లెటర్ హెడ్, విజిటింగ్ కార్డ్, పేపర్ వెయిట్, నేమ్‌ప్లేట్, రాజముద్ర, ఇంటర్‌కామ్ అందించాలని రెవెన్యూ అసిస్టెంట్‌ను ఆదేశించారు. ఇక ఆమె తండ్రైన రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి తన కుమార్తె డిమాండ్లను నెరవేర్చాలని కలెక్టర్ కార్యాలయ అధికారులను ఒత్తిడి చేశారు. లేదంటే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: USA: భారత్-రష్యా సంబంధాలపై అమెరికా కీలక వ్యాఖ్యలు..
ఈ వ్యవహారం మహారాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో చర్యలు చేపట్టింది. పూణె కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివాసే.. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లడంతో పూజా ఖేద్కర్‌ను పూణె నుంచి వాషిమ్‌కు బదిలీ చేశారు. ఆమె తన ప్రొబేషన్ కాలం పూర్తయ్యే వరకు వాషిమ్ జిల్లాలో సూపర్ న్యూమరరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా వ్యవహరిస్తారని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Minister PRO committed suicide: మంత్రి పీఆర్వో ఆత్మహత్య.. కారణం ఇదే..