పూణె అత్యాచార నిందితుడు దత్తాత్రయ రాందాస్(36) ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 75 గంటల పోలీసుల వేట తర్వాత దొరికిపోయాడు. నిందితుడి కోసం దాదాపు 13 పోలీస్ బృందాలు వేటాడాయి. పూణె సమీప ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా వేటాడారు. డ్రోన్లు, డాగ్‌స్క్వాడ్స్‌తో తనిఖీలు చేపట్టారు. అయితే పూణె సమీప గ్రామాల్లో ఎత్తున చెరుకు తోటలో ఉన్నట్లుగా డ్రోన్ సాయంతో గుర్తించారు. ఆ దిశగా పోలీసులు వేటాడారు. అయితే అర్ధరాత్రి సమయంలో తీవ్రమైన ఆకలి వేయడంతో ఓ ఇంటికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అయితే అప్పటికే నిందితుడి ఆచూకీ చెబితే రూ.లక్ష బహుమతి ఇస్తామని ప్రకటించారు. మొత్తానికి ఇంటి వారు పోలీసులకు రహస్యంగా సమాచారం ఇవ్వడంతో చాకచాక్యంగా పోలీసులు ఎంట్రీ ఇచ్చి నిందితుడు దత్తాత్రయ రాందాస్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇది కూడా చదవండి: Earthquake: నేపాల్, పాకిస్థాన్.. ఉత్తర భారత్‌లో భూప్రకంపనలు
మహారాష్ట్రలో అతిపెద్ద బస్సు డిపోల్లో ఒకటైన పూణెలోని స్వర్గేట్ బస్టాండ్ దగ్గర మంగళవారం ఉదయం 6 గంటలకు బస్సు కోసం ఓ యువతి (26) నిరీక్షిస్తోంది. అక్కడే ఉన్న రాందాస్… చెల్లి అని సంబోధించాడు. మీ ఊరు వెళ్లే బస్సు ఇక్కడ లేదని.. ఫలానా చోటు ఉందని నమ్మించి తీసుకెళ్లాడు. బస్సులో ఎవరూ లేకపోవడంతో ఎక్కేందుకు సంకోచించింది. అయితే లోపల ప్రయాణికులు నిద్రపోతున్నారని చెప్పడంతో లోపలికి వెళ్లింది. అంతే వెంటనే బస్సు డోర్ మూసివేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం వెంటనే బస్సులోంచి దూకేసి పారిపోయాడు. అయితే బాధితురాలు.. జరిగిన ఘోరాన్ని స్నేహితురాలితో పంచుకోవడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు రాందాస్‌గా గుర్తించారు.
ఇక ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఉరితీయాలని డిప్యూటీ సీఎంలు అజిత్ పవార్, షిండే డిమాండ్ చేశారు. అలాగే ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిస్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే బాధితురాలికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే నిందితుడు రాందాస్‌పై అనేక నేరాలు, దోపిడీ కేసులు ఉన్నాయి. స్వర్గేట్ బస్టాండ్ దగ్గర ట్యాక్సీ డ్రైవర్‌గా ఉంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా స్థానిక పోలీసులతో కూడా సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. తాను కూడా పోలీస్ అంటూ నటించేవాడని స్థానికులు చెబుతున్నారు. ఇక వృద్ధులను ట్యాక్సీ ఎక్కించుకుని వారి దగ్గర బంగారం, డబ్బులు దోచుకునేవాడని సమాచారం. నిందితుడి దుర్మార్గాలను పోలీసులు వెలికి తీస్తున్నారు.
ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ..