Hardeep Nijjar Killing: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ నిజ్జర్ హత్య కెనడా, భారత్ మధ్య ఇంకా ఉద్రిక్తతలను పెంచుతూనే ఉంది. గతేడాది సర్రే నగరంలో గురుద్వారా సమీపంలో నిజ్జర్‌ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అయితే, ఈ కేసును విచారించిన కెనడా పోలీసులు ముగ్గురు భారతీయులను విచారిస్తు్న్నారు. వీరికి ఈ హత్యతో సంబంధం ఉందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరికి భారత ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయా?? లేదా.? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని అక్కడి అధికారులు చెబుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై మరోసారి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కీలక వ్యాఖ్యలు చేశారు. నిజ్జర్ హత్యకు సంబంధించి విచారణ ముగ్గురికే పరిమితం కాదని ఆదివారం అన్నారు. కెనడా ఒక రూల్ ఆఫ్ లా దేశమని చెప్పారు.
Read Also: Rohith Vemula: రోహిత్ వేముల మృతి విచారణలో వైరుధ్యాలు, న్యాయం జరిగేలా చూస్తాం: కాంగ్రెస్..
నిజ్జర్ హత్యలో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ముగ్గురు భారతీయుల్ని అరెస్ట్ చేసిన తర్వాత కెనడా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో నిజ్జర్ మృతిపై పీఎం ట్రూడో మాట్లాడుతూ.. ఈ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని అన్నారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. కెనడా ఆరోపణలు అసంబద్ధ, రాజకీయ ప్రేరేపితమైనవని భారత్ తీవ్రంగా ఖండించింది. తాజాగా మరోసారి ఈ హత్యపై ట్రూడో మాట్లాడుతూ..‘‘కెనడా బలమైన స్వతంత్ర న్యాయ వ్యవస్థతో పాటు తన పౌరులందరినీ రక్షించడానికి ప్రాథమిక నిబద్ధతతో కూడిన నియమావళి దేశం. చాలా మంది కెనడియన్లు, ముఖ్యంగా సిక్కు సంఘం సభ్యులు అసౌకర్యానికి గురవుతున్నారని నాకు తెలుసు.’’ అని అన్నారు. కెనడియన్లకు వివక్ష, హింస లేకుండా సురక్షితంగా జీవించే హక్కు ఉందని, మన ప్రజాస్వామ్య సూత్రాలు, మన న్యాయ వ్యవస్థ పట్ల నిబద్ధతతో స్థిరంగా, శాంతంగా ఉండాలని కోరారు.
అయితే, ముగ్గురు భారతీయుల అరెస్టుపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. కెనడా వ్యవస్థీకృత నేరాల్లో సంబంధాలు ఉన్న వ్యక్తులకు వీసాలు ఇస్తోందని మండిపడ్డారు. కెనడాలో పాకిస్తాన్ అనుకూల వైఖరితో కొందరు వ్యక్తులు రాజకీయంగా సంఘటితమై ప్రభావవంతమైన రాజకీయ లాబీని నడుపుతున్నారని జైశంకర్ అన్నారు. ముగ్గురి అరెస్ట్ చేసినట్లు నివేదికలు చూశామని, కెనడియన్ పోలీసులు విచారిస్తున్నట్లు ఆయన చెప్పారు.