NTV Telugu Site icon

Priyanka Gandhi: ప్రియాంక అరంగేట్రం అదిరింది.. లోక్‌సభలో అడుగుపెట్టేదెప్పుడంటే..!

Priyankagandhi

Priyankagandhi

రాహుల్‌‌గాంధీ సోదరి, కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ రాజకీయ అరంగేట్రం అదిరిపోయింది. తొలి ప్రయత్నంలోనే సూపర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. వయనాడ్‌ లోక్‌సభ ఉపఎన్నికల్లో పోటీ చేయకముందు.. కాంగ్రెస్ పక్షాన ప్రచారం మాత్రమే నిర్వహిస్తూ ఉండేవారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ.. కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తూ ఉండేవారు. అన్ని వెనుకుండే నడిపించేవారు. అలాంటిది తొలిసారి వయనాడ్ లోక్‌సభ బైపోల్స్‌ ద్వారా రాజకీయ అరంగ్రేటం చేశారు. అంతే కనీవినీ ఎరుగని రీతిలో భారీ విక్టరీ అందుకున్నారు. తన సోదరుడు రాహుల్‌గాంధీ మీద ఉన్న 3.64 లక్షల మెజార్టీని దాటుకుంటూ 4 లక్షల మెజార్టీని క్రాస్ చేసి అత్యధిక విజయాన్ని సొంతం చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌పై 4,08,036 ఓట్ల మెజార్టీతో ప్రియాంక విక్టరీ సాధించారు.

ఇదిలా ఉంటే నవంబర్ 25 (సోమవారం) నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. దీంతో సోమవారమే ప్రియాంక లోక్‌సభలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. సోదరుడితో కలిసి లోక్‌సభలోకి ప్రవేశించి.. ఎంపీగా ప్రియాంక ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఇక గాంధీ ఫ్యామిలీలో ఉన్న ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో ఉండడం విశేషం. తల్లి సోనియాగాంధీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. రాజస్థాన్ నుంచి ఆమె రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక రాహుల్‌గాంధీ.. కంచుకోట అయిన రాయ్‌బరేలీ నుంచి ప్రతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ప్రియాంక వయనాడ్ నుంచి విజయం సాధించి పార్లమెంట్‌లోకి అడుగుపెడుతున్నారు. మొత్తానికి తల్లి సోనియాతో పాటు ఇద్దరు పిల్లలు లోక్‌సభలో ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ రాయ్‌బరేలీ, వయనాడ్ నుంచి పోటీ చేశారు. రెండు స్థానాల నుంచి కూడా భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో వయనాడ్ స్థానాన్ని వదులుకుని.. రాయ్‌బరేలీలో కొనసాగుతున్నారు. వయనాడ్‌ స్థానాన్ని రాహుల్ వదులుకున్నప్పుడే.. ఆ స్థానంలో ప్రియాంక పోటీ చేస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు. అన్నట్టుగానే ఆమె బరిలోకి దిగి తొలి అరంగేట్రంలో భారీ విక్టరీని అందుకున్నారు.