NTV Telugu Site icon

Modi-Advani: అద్వానీ ఇంటికి వెళ్లి బర్త్‌డే విషెస్ చెప్పిన ప్రధాని మోడీ

Modiadvani

Modiadvani

ప్రధాని మోడీ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే.అద్వానీ ఇంటికి వెళ్లారు. అద్వానీ శుక్రవారం (నవంబర్ 8) 97వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అద్వానీకి ప్రధాని మోడీ బర్త్‌డే విషెస్ చెప్పారు. అద్వానీ ఇంటికి వెళ్లిన మోడీ.. పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ అగ్ర నేతలంతా అద్వానీ ఇంటికి వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ కూడా.. అద్వానీని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అద్వానీ దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నారు.

అద్వానీ  బీజేపీలో సీనియర్ నాయకుడు. 1927, నవంబర్ 8న సింధ్ ప్రాంతంలోని కరాచి పట్టణంలో సంపన్న వ్యాపార కుటుంబంలో జన్మించారు. 15 సంవత్సరాల వయస్సులోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.)లో ప్రవేశించారు. దేశ విభిజన సమయంలో భారత దేశానికి వలస వచ్చి దేశ రాజకీయాలకే అంకితమయ్యారు. భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి అనతి కాలంలోనే ముఖ్య పదవులు పొందారు. 1967లో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షుడయ్యారు. 1977లో మురార్జీ దేశాయ్ ప్రభుత్వంలో మంత్రిపదవి పొందారు. 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించే అవకాశం లభించింది. అటల్ బిహారి వాజపేయ్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో కీలకమైన హోంశాఖ పదవిని నిర్వహించారు. 2009 ఎన్నికలకు ముందే భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు.

2024 ఫిబ్రవరి 3న కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించింది. రాష్ట్రపతి భవన్‌లో మార్చి 30న జరిగిన అవార్డుల ప్రధానోత్సవానికి వయోభారం, అనారోగ్యం కారణంగా ఆయన హాజరుకాలేకపోవడంతో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము మార్చి 31న స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్లి అవార్డును అందజేసింది. ఇటీవల పలుమార్లు అద్వానీ అనారోగ్యానికి గురయ్యారు. తిరిగి కోలుకుని ఇంటి దగ్గరే ఉంటున్నారు.