NTV Telugu Site icon

PM Modi: మీకు 100కి 99 కాదు, 543కి 99 వచ్చాయి.. కాంగ్రెస్ గుర్తుంచుకోవాలి..

Pm Modi

Pm Modi

PM Modi: ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్‌‌తో పాటు ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. పవర్‌ఫుల్ స్పీచ్‌తో విపక్షాలను ఢిపెన్స్‌లో పడేశారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన స్కాములు, ఉగ్రవాద దాడులను గుర్తుచేశారు. ఎన్డీయే హయాంలో తమ ప్రభుత్వం ఉగ్రవాదుల్ని అణిచివేశామని, ఎయిర్ స్ట్రైక్, సర్జికల్ స్ట్రైక్ చేశాయని చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని ఆరాధించే వారు, ఓటు బ్యాంకు రాజకీయాలనున ఆయుధంగా మార్చుకున్నారని, అక్కడ ప్రజల హక్కుల్ని అణిచివేశారని అన్నారు. రాజ్యాంగం జమ్మూ కాశ్మీర్‌లో అమలు కాలేదని అన్నారు. పార్లమెంట్‌లో రాజ్యాంగాన్ని తలపై పెట్టుకుని డ్యాన్స్ చేసే వారు జమ్మూ కాశ్మీర్‌లో రాజ్యాంగాన్ని అమలు చేయలేదని దుయ్యబట్టారు. ఈ రోజు అక్కడ ఆర్టికల్ 370 గోడ బద్ధలైందని, రాళ్లదాడి ఆగిపోయిందని చెప్పారు.

Read Also: PM Modi: కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు, ఉగ్రదాడులు.. పార్లమెంట్‌లో ధ్వజమెత్తిన ప్రధాని మోడీ..

2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌కి ఈ దేశ ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోవాలని ఆదేశం ఇచ్చారని, మీరు అక్కడే కూర్చోండి, అరవండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014కి ముందు ఈ దేశం ఏం చేయలేదనే భావన ప్రజల్లో నెలకొని ఉండేదని, ఇప్పుడు దాన్ని మార్చేశామని అన్నారు. ఈ దేశం తలుచుకుంటే ప్రతీది సాధ్యమే అని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. దేశం ఇప్పుడు ఐదో ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని, మొబైల్ ఫోన్లలో అతిపెద్ద తయారీదారుగా ఎదిగిందని చెప్పారు. ఇప్పుడు దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని అన్నారు.

ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్డీయే క్లీన్ స్వీప్ చేసిందని గుర్తు చేశారు. చిల్లర రాజకీయాలు దేశంలో నడవవని చెప్పారు. బీజేపీ కేరళలో ఈ సారి ఖాతా తెరిచిందని చెప్పారు. తమిళనాడులో చాలా చోట్ల బీజేపీ తన ముద్ర చాటుకుందని చెప్పారు. కర్ణాటక, యూపీ, రాజస్థాన్‌లో బీజేపీ ఓట్ పర్సెంటేజ్ పెరిగిందని చెప్పారు. వచ్చే రోజులు మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయని, మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌లో ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 100కి 99 రాలేదని, 543 సీట్లకు 99 వచ్చాయని, ఈ విషయాన్ని కాంగ్రెస్ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. మూడు సార్లు కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు రాలేదని, దేశ రాజకీయాల్లో ఇదే మొదటిసారని అన్నారు. కాంగ్రెస్‌కి ఇది మూడో అత్యంత దరిద్ర ప్రదర్శన అని అన్నారు.