Site icon NTV Telugu

Karnataka Elections: కర్ణాటకలో ప్రచారానికి ప్రధాని మోదీ.. 20 చోట్ల భారీ బహిరంగ సభలు

Pm Modi

Pm Modi

Karnataka Elections: కర్ణాటక ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్, జేడీయూలు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించాయి. అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ, అధికారంలోకి రావాలని కాంగ్రెస్, కింగ్ మేకర్ పాత్ర పోషించాలని జేడీఎస్ ఇలా ప్రతీపార్టీ కూడా తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ఈ ఎన్నికలను అంతా సెమీఫైనల్ గా భావిస్తున్నారు.

Read Also: BJP Reacts: గాంధీ కుటుంబంపై చెంపదెబ్బ.. సూరత్ కోర్టు తీర్పుపై బీజేపీ

ఇదిలా ఉంటే కర్ణాటక ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్రమోదీ వెళ్లనున్నారు. ఈ నెల 28 నుంచి దాదాపుగా వారం రోజుల పాటు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. దాదాపుగా 20 చోట్ల భారీ బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొనేలా కర్ణాటక బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ రోజులో నామినేషన్ ప్రక్రియ ముగుస్తుండటంతో ప్రచారంపై బీజేపీ నేతలు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో మాజీ సీఎం, బీజేపీ నేత యడియూరప్ప కీలకంగా వ్యవహరిస్తున్నారు. బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యత మరోసారి అధిష్టానం ఆయనపై పెట్టింది. యడియూరప్పను సీఎం కుర్చీ నుంచి దించేసి, బసవరాజ్ బొమ్మైని సీఎంగా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి యడియూరప్ప ఎన్నికల్లో పోటీ చేయకుండా, ఆయన కొడుకును బరిలోకి దించారు. ఇదిలా ఉంటే సీఎం ఎవరన్నదానిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ప్రస్తుత సీఎం బొమ్మై వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. లింగాయత్ వర్గంలో బలమైన నేతగా ఉన్న యడియూరప్ప, ఆ వర్గం నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కర్ణాటక ఎన్నికలల్లో లింగాయత్, వొక్కలిగ వర్గాలు కీలకంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ రెండు వర్గాల ఓట్లను సాధించేందుకు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్, జేడీఎస్ ప్రయత్నిస్తున్నాయి.

Exit mobile version