Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం కర్ణాటకలోని కార్వార్ నావల్ బేస్‌లో జలాంతర్గామిలో ప్రయాణించారు. కల్వరి క్లాస్ సబ్‌మెరైన్ అయిన INS వాఘషీర్‌లో రాష్ట్రపతితో పాటు నావికాదళ ప్రధాన అధికారి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి కూడా ప్రయాణించారు. జలాంతర్గామిలో సముద్రంలోకి వెళ్లిన రెండో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. అంతకుముందు, ఫిబ్రవరి 2006లో జలాంతర్గామిలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా ఏపీజే అబ్దుల్ కలాం నిలిచారు.
Read Also: Sudha Kongara: రజనీకాంత్‌తో ఆ సినిమా తీయాలి: సుధా కొంగర
భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్ అయిన రాష్ట్రపతి నావికాదళ యూనిఫాం ధరించి, సబ్‌మెరైన్‌లోకి ప్రవేశించారు. “కార్వార్ నావల్ బేస్‌లో ఇండియన్ నేవీ స్వదేశీ కల్వరి క్లాస్ జలాంతర్గామి INS వాఘ్షీర్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణించారు” అని రాష్ట్రపతి కార్యాలయం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
P75 స్కార్పీన్ ప్రాజెక్ట్‌లో చివరిదైన ఆరో జలాంర్గామి అయిన INS వాఘ్షీర్ను జనవరిలో భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. నేవీ అధికారులు దీనిని ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్దమైన డీజిల్-ఎలక్ట్రిక్ జలాంతర్గాములలో ఒకటిగా అభివర్ణిస్తున్నారు. ఈ జలాంర్గామిని అనేక రకాల మిషన్లను నిర్వహించడానికి రూపకల్పన చేశారు. శత్రువుల ఉపరితల నౌకలు(యాంటీ-సర్ఫేస్ వార్ఫేర్), శత్రు జలాంతర్గాములపై పోరాటం(యాంటీ-సబ్‌మెరైన్ వార్ఫేర్), గూఢచార సమాచార సేకరణ, ప్రత్యేక ఆపరేషన్లు, నిఘాకు ఉపయోగిపడుతుంది. ఇది వైర్-గైడెడ్ టార్పెడోలు, యాంటీ-షిప్ క్షిపణులు, ఆధునిక సోనార్ వ్యవస్థలతో ఆయుధీకరించబడింది.