NTV Telugu Site icon

Mallikarjun Kharge: ‘‘ముందస్తు ప్లాన్ ప్రకారమే’’.. నితీష్-బీజేపీ పొత్తుపై కాంగ్రెస్..

Mallikarjun Kharge

Mallikarjun Kharge

Mallikarjun Kharge: సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమిని వదిలి, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జన ఖర్గే ఆరోపించారు. జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ఇండియా కూటమిని చీకట్లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, జేడీయూ కలిసి ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయడానికి ప్లాన్ చేశారని ఆదివారం దుయ్యబట్టారు.

‘‘ఇలాంటి నిర్ణయాలు తొందరపడి తీసుకోలేం. ఇదంతా ముందస్తు ప్రణాళికతో జరిగిందని తెలియజేస్తోంది. ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ-జేడీయూ ఇదంతా ప్లాన్ చేసింది. నితీష్ కుమార్ మమ్మల్ని, లాలూ ప్రసాద్ యాదవ్‌ని చీకట్లో ఉంచాడు’’ అని ఖర్గే అన్నారు.

Read Also: Google Maps: గూగుల్ తల్లిని నమ్ముకుంటే.. చివరకు కారుని ఎక్కడికి తీసుకెళ్లిందో చూడండి..

లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీని, ప్రధాని మోడీని ఎదుర్కొనేందుకు నితీష్ కుమార్ ఆధ్వర్యంలోనే ఇండియా కూటమికి రూపకల్పన జరిగింది. తొలి సమావేశం పాట్నాలో నితీష్ నిర్వహించారు. అయితే, అనూహ్యంగా ఇండియా కూటమి, బీహార్‌లో ఆర్జేడీతో పొత్తును ఉపసంహరించుకున్నాడు. తన పాతమిత్రులు బీజేపీతో కలిసి ఆదివారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఒక్కసారిగా ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.

2000లో ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్ ‘జంగిల్ రాజ్’కి వ్యతిరేకంగా ప్రచారం చేసి తొలిసారిగా నితీష్ కుమార్ సీఎం అయ్యారు. 2013లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీని ప్రకటించిన తర్వాత 17 ఏళ్ల పొత్తు తర్వాత నితీష్ ఎన్డీయేతో తెగతెంపులు చేసుకున్నారు. 2017లో ఆర్జేడీ-జేడీయూతో మహాకూటమి ఏర్పాటు చేశారు, తిరిగి మళ్లీ 2019 లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీతో జట్టుకట్టారు. 2022లో మరోసారి బీజేపీతో బంధాన్ని తెంచుకుని ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్నారు. తాజాగా మరోమారు బీజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.