NTV Telugu Site icon

Prashant kishor: కాంగ్రెస్ పై పీకే సంచలన వ్యాఖ్యలు… అక్కడ కూడా గెలవదు

Prashant Kishor

Prashant Kishor

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల రాజస్తాన్ ఉదయ్ పూర్ లో నిర్వహించిన చింతన్ శిబిర్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని.. దీని వల్ల కాంగ్రెస్ అధిష్టానం వారి నాయకత్వానికి కొంత సమయం ఇవ్వడం తప్పా సాధించిందేం లేదని..  రానున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఓడిపోతుందని ట్వీట్ చేశారు.

ఇటీవల వరస పరాజయాలతో ఢీలా పడ్డ కాంగ్రెస్ పార్టీ మళ్లీ పూర్వవైభవం తీసుకువచ్చేలా ప్రశాంత్ కిషోర్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నేతలకు పలు సూచనలు చేశారు. పార్టీ మళ్లీ గాడిలో పడేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీకి సూచించారు పీకే. పార్టీ నిర్మాణంతో పాటు వ్యూహాల్లో కూడా కీలక మార్పులను సూచించారు. ఆదే సమయంలో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరి కీలక బాధ్యతలను చేపడుతారని ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే ఆ తరువాత నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని పీకే తెలిపారు. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీనే అని గతంలో పలు మార్లు పీకే వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లేకుండా ఎలాంటి ఫ్రంట్ కూడా సాధ్యం కాదని వెల్లడించారు.

అయితే పీకే సూచించిన సూచనలను ‘చింతన్ శిబిర్ ’లో అమలు చేస్తారని పార్టీ నిర్మాణంలో కీలక మార్పులతో పాటు అధ్యక్ష ఎన్నికలు కూడా ఉండవచ్చనే వార్తలు వినిపించాయి. అయితే కాంగ్రెస్ మాత్రం కొన్ని కీలక నిర్ణయాలను మాత్రమే తీసుకుంది. ‘ ఒక కుటుంబం- ఒక టికెట్’, పార్టీలో కనీసం 5 ఏళ్లు పని చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుందని… రాజ్యసభ స్థానం ఒకరికి రెండు సార్లు మాత్రమే కేటాయిస్తామనే కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. కానీ పార్టీలో సంస్థాగత నిర్మాణంపై పెద్దగా చింతన్ శిబిర్ లో చర్చించలేదు. ఈనేపథ్యంలో పీకే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసినట్లు తెలుస్తోంది.