ఇటీవల దేశంలో జరిగిన 5 రాష్రాల ఎన్నికలకు నేడు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఉదయం 8 గంటలకే ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. 4 రాష్ట్రాల్లో బీజేపీ ముందంజలో ఉండగా, ఆప్ ఒక రాష్ట్రంలో ముందంజలో ఉంది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతవడం ఆశ్చర్యం కలిగించే విషయం. గత ఎన్నికల్లో పంజాబ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని కూడా చేజార్చకున్నట్లు కనిపిస్తోంది. పంజాబ్లో ఆప్ అభ్యర్థులు దూసుకుపోతున్నారు.
ఇదిలా ఉంటే.. మిగితా నాలుగు రాష్ట్రాలు మణిపూర్, గోవా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. అయితే ఉత్తరాఖండ్లో దాదాపు బీజేపీ విజయం ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా బీజేపీ ఉత్తరాఖండ్ ఇంచార్జ్, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఎన్టీవీతో మాట్లాడుతూ.. ఈ సారి కూడా పుష్కర్ సింగ్ ధామినే ఉత్తరాఖండ్ సీఎం అభ్యర్థి అన్నట్లు ఆయన స్పష్టం చేశారు. సాయంత్రం వరకు పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి.