PMKMDY: రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. ఇప్పటికే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా అర్హత కలిగిన రైతులకు ఎకరానికి రూ. 6000 లను కేంద్రం అందిస్తోంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పేరుతో ఎకరానికి రెండు విడతలుగా రూ.10,000లను అందిస్తోంది. ఇదిలా ఉంటే వయసు పైబడి వ్యవసాయానికి దూరం అవుతున్న రైతులను ఆదుకునేందుకు కేంద్రం ‘ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన’ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద 60 ఏళ్లు నిండిన రైతులు ప్రతీ నెల పింఛన్ పొందొచ్చు. నెలకు రూ. 3000 వేల పింఛన్ అందుతుంది.
అర్హతలు.. అనర్హతలు ఇవే:
ఈ పథకానికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్న రైతులు అర్హులు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో భూరికార్డుల్లో పేరుండి, 2 హెక్టార్ల కన్నా సాగుకు యోగ్యమయ్యే భూమి కలిగి ఉండాలి. చిన్న, సన్నకారు రైతులు ఈ పథకం కింద పేర్లు నమోదు చేసుకోవచ్చు. పింఛన్ మాత్రం 60 ఏళ్లు నిండిన తర్వాత మాత్రమే వస్తుంది.
నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్ పీ ఎస్), ఈఎస్ఐ, ఈపీఎఫ్ఓ పరిధిలో ఉన్నవారు, ఏవైనా ఇతర చట్టబద్ధమైన సామాజిక భద్రత పథకాల్లో ఉన్నవారు, జాతీయ పెన్షన్ ఎంచుకున్న రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నత ఆర్థిక స్థితి కలిగిన వర్గాల వారు ‘పీఎం కిసాన్ మాన్‌ధన్’ పింఛన్ పొందడానికి అనర్హులు.
ప్రీమియం ఇలా చెల్లించాలి:
60 ఏళ్లు నిండే వరకు రైతులు ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతీ నెల రూ. 3000 పింఛన్ అందుతుంది. పథకంలో చేరేవారికి వయసును బట్టి ప్రీమియం ఉంటుంది. రైతు చెల్లించిన మేరకు ప్రభుత్వం కూడా తన వంతు వాటాను బీమా కంపెనీకి ఇస్తుంది. 18 ఏళ్ల వయసు ఉన్న రైతు తనవాటాగా రూ.55 చెల్లిస్తే, కేంద్రం కూడా తన వాటాగా రూ.55 కలిపి మొత్తంగా రూ. 110ని బీమా కంపెనీకి చెల్లిస్తుంది. 18 ఏళ్ల వారికి ప్రీమియం రూ.55 ఉండగా ఏటా వయసును బట్టి రూ. 3 నుంచి రూ. 10 వరకు పెంచుతుంది. 40 ఏళ్ల ఏళ్ల వారికి రూ. 200 ప్రీమియం ఉంది.
రైతు మరణిస్తే భార్యకు పింఛన్:
ఈ పథకంలో రైతు మరణిస్తే, ఆయన జీవిత భాగస్వామికి పింఛన్ వస్తుంది. 60 ఏళ్ల వయసు నిండిన తర్వాత రూ. 3 వేల చొప్పున పింఛన్ అందిస్తారు. ఒకవేళ వయసు నిండిన తర్వాత రైతు మరణించస్తే భాగస్వామికి ఇందులో సగం పింఛన్ ఇస్తారు. అయితే పథకాన్ని కొనసాగించేందుకు కనీసం పదేళ్ల పాటు రైతు తన వాతటా ప్రీమియం నిర్దేశిత తేదీ ప్రకారం చెల్లించాలి.
ఇలా అప్లై చేసుకోండి:
రైతన్నలు కామన్ సర్వీస్ సెంటర్లో తమ పేర్లను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. రైతు ఫోటో, నివాస, ఆదాయ, వయసు నిర్థారణ పత్రాలతో పాటు సాగుభూమి, ఆధార్ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అన్ని వివరాలను కేంద్ర పీఎంకేవై పోర్టర్ లో నమోదు చేసిన తర్వాత రైతుకు సమాచారం వస్తుంది. ప్రత్యేక పింఛన్ ఖతాను తెలిరి కార్డును అందిస్తారు.