NTV Telugu Site icon

PM Modi: ఖలిస్తానీ పన్నూ హత్య కుట్రపై తొలిసారి స్పందించిన ప్రధాని మోడీ..

Pm Modi, Biden

Pm Modi, Biden

PM Modi: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు భారతీయుడు కుట్ర పన్నాడని అమెరికా న్యాయశాఖ అభియోగాలను మోపింది. నిఖిల్ గుప్తా అనే భారతీయుడు కుట్రకు పాల్పడినట్లు, అతనికి భారత ప్రభుత్వం ఉద్యోగి సహకరించినట్లు ఆరోపిస్తోంది. అమెరికా కోరిక మేరకు చెక్ రిపబ్లిక్ దేశం నిఖిల్ గుప్తాను అరెస్ట్ చేసింది. అతడిని తమకు అప్పగించాలని యూఎస్ కోరుతోంది. ఇదిలా ఉంటే ఈ పన్నూ వ్యవహారంలో భారత్-యూఎస్ రెండూ కూడా ఉన్నత స్థాయిలో చర్చించుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇండియా విచారణ కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.

ఇదిలా ఉంటే తొలిసారి భారత ప్రధాని నరేంద్రమోడీ పన్నూ హత్య కుట్రపై స్పందించారు. అమెరికా చేస్తున్న ఆరోపణలపై స్పందించిన ప్రధాని.. ప్రభుత్వం ఏదైనా సాక్ష్యాలను పరిశీలిస్తోందని ఆయన అన్నారు. యూకే ఆధారిత ది ఫైనాన్షియఅల్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండియా, అమెరికా సంబంధాలను ఇటీవల కాలంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలకు ముడిపెట్టడం భావ్యం కాదని అన్నారు.

Read Also: Pallavi Prashanth: పరారీలో పల్లవి ప్రశాంత్.. క్షమించండి అంటూ వీడియో రిలీజ్

భారతదేశ పౌరులు ఇతర దేశాల్లో ఏదైనా చేసినట్లు సమాచారం వస్తే దానిని విచారించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చట్టాలని లోబడి పాలన చేసేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. విదేశాల్లో తీవ్రవాద గ్రూపుల కార్యకలాపాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. భావ ప్రకటన ముసుగులో బెదిరింపులు, హింసను ప్రేరేపిస్తున్నారని అన్నారు. ఇరు దేశాల మధ్య భద్రత, ఉగ్రవాద వ్యతిరేక సహకారం కీలక అంశమని చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతం కోసం బలమైన ద్వైపాక్షిక మద్దతు ఉందని, ఇది పరిణితి చెందిన స్థిరమైన భాగస్వామ్యానికి స్పష్టమైన సూచిక అని ప్రధాని అన్నారు.

నిఖిల్ గుప్తా అనే వ్యక్తి, ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూను హత్య చేసేందుకు ఓ కాంట్రాక్ట్ కిల్లర్‌తో 1,00,000 డాలర్లు చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నాడని, అయితే ఈ కుట్రను అమెరికా అడ్డుకున్నట్లు అక్కడి మీడియా పేర్కొంది. పన్నూ న్యూయార్క్‌లో నివసిస్తూ.. అమెరికా-కెనడా ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు. అయితే అమెరికా గడ్డపై ఒక అమెరికన్ సిటిజన్‌ని చంపేందుకు ప్లాన్ చేయడాన్ని అమెరికా సీరియస్‌గా తీసుకుంది. ఒక వేళ నేరం రుజువైతే 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది.