ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విజయం అని ఆయన అభివర్ణించారు. దేశంలో తమ పాలనకు ప్రజలు ఇచ్చిన బహుమతి అని తెలిపారు. ఈసారి హోలీ మార్చి 10నే మొదలైందని.. ఇవాళ్టి ఫలితాల్లో గొప్ప సందేశం ఉందన్నారు. ప్రజల నమ్మకం, విశ్వాసం పొందేందుకు బీజేపీ కార్యకర్తలు కృషి చేశారు కాబట్టి ఇది కార్యకర్తల విజయమని మోదీ తెలిపారు. దేశంలోని నాలుగు వైపులా ప్రజలు బీజేపీ వైపు నిలబడ్డారని… మొదటి సారి ఓటేసిన యువకులు బీజేపీకి అండగా నిలిచారని మోదీ పేర్కొన్నారు.
తమ పాలన కారణంగానే యూపీలో రెండోసారి గెలిచామని.. అటు ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో బీజేపీకి ఆదరణ పెరిగిందని మోదీ వెల్లడించారు. యూపీలో ఏడు దశల ఎన్నికలు ప్రశాంతంగా జరగడం గొప్ప విషయమన్నారు. ఆవేశంతో ఉన్నప్పుడు సంయమనం కోల్పోకూడదని, కరోనా సమయంలో పోరాటం చేసేటప్పుడు ప్రతిపక్షాలు తమపై కుట్ర చేశాయని మోదీ ఆరోపించారు. అందరూ రాసిపెట్టుకోవాలని… 2017 యూపీ అసెంబ్లీ ఫలితాలు 2019లో రిపీట్ అయ్యాయని.. 2022 ఫలితాలు 2024లో రిపీట్ అవుతాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
అటు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా క్రూడాయిల్, వంటనూనెల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌కు బడ్జెట్‌లో కొత్త శక్తిని అందించామని తెలిపారు. యుద్ధం ప్రభావం ప్రపంచం మొత్తంపై ఉందని.. భారత్ మాత్రం శాంతి మార్గంవైపే నిలబడిందని చెప్పారు. దేశంలో బీజేపీ సుపరిపాలన వల్లే ఈ ఫలితాలు వచ్చాయని ప్రధాని మోదీ అన్నారు. గ్యాస్, విద్యుత్, నీరు, టెలిఫోన్ సౌకర్యాలు అన్ని వర్గాల ప్రజలకు అందాయని తెలిపారు. పేదలకు దక్కాల్సిన ప్రభుత్వ పథకాలన్నీ దక్కేవరకు వదిలిపెట్టనని స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలనకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు. కోట్లాది మంది మాతృమూర్తులు, మహిళల శక్తే తమకు రక్షణ అన్నారు. ఇప్పటికైనా మేధావులు పాత భావాలు వదిలిపెట్టి కొత్తగా ఆలోచించాలని మోదీ సూచించారు.
When we formed govt in 2019 (at Centre), 'experts' said it was because of the 2017 victory (in UP)… I believe the same 'experts' will say that 2022 election result will decide the fate of 2024 national elections: PM Modi pic.twitter.com/UpU2uwyRlN
— ANI (@ANI) March 10, 2022