PM Narendra Modi: భారత ప్రజానీకం నవచేతనతో ముందడుగు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశం ఎవరికీ తలవంచదని, ఎన్ని సవాళ్లు ఎదురైనా ముందుకెళ్తూనే ఉందన్నారు. స్వాతంత్య్ర సమరయోధులను ఇవాళ భారత్ గౌరవించుకుంటోందన్నని ఉద్వేగ పూరితంగా ప్రసంగించారు. దేశ స్వాతంత్య్ర తమ ప్రాణాలను సైతం లెక్క చేయని బాపు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాబాసాహెబ్ అంబేద్కర్, వీర్ సావర్కర్ తదిరత మహోన్నతులకు దేశ పౌరులం కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశం కోసం పోరాడిన వీరనారీమణులకు సెల్యూట్ అంటూ ప్రధాని ప్రసంగించారు.
ఈ పోరాటంలో ఎంతో మంది ప్రముఖులు దేశాన్ని జాగృతం చేశారన్నారు. త్యాగధనుల పోరాటల ఫలితమే మన స్వాతంత్రం. మంగళ్ పాండే, తాత్యా తోపే, భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు, చంద్రశేఖర్ ఆజాద్, అష్ఫాఖుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, బ్రిటిష్ పాలన పునాదిని కదిలించిన మన అసంఖ్యాక విప్లవకారులకు ఈ దేశం కృతజ్ఞతలు తెలుపుతోందన్నారు. భారత గడ్డపై ఉన్న మట్టిలో శక్తి ఉందని, ఎన్ని సవాళ్లు ఎదురైనా దేశం ముందుకెళ్లకుండా ఆగేదే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశం ఎవరికీ తలవంచదని, ముందుకు వెళ్తూనే ఉంటుందని నొక్కి చెప్పారు. వందల ఏళ్ల బానిసత్వంలో భారతీయతకు భంగం కలిగిందని మోదీ పేర్కొన్నారు. బానిసత్వంలో భారతీయత భావన గాయపడిందని చెప్పారు. ఆకలికేకల భారతం నేడు ఆహారధాన్యాల ఎగుమతి స్థాయికి చేరుకుందన్నారు. వైజ్ఞానికరంగంంలో భారత్ తనదైన ముద్ర వేస్తోందన్నారు. ఈ గౌరవం అకుంఠిత దీక్షతో పనిచేసిన ప్రతి పౌరుడికి దక్కుతుందని ప్రధాని మోడీ వివరించారు.
PM Narendra Modi: భారత్.. ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది
మన సైనికులకు ఎన్ని సార్లు వందనం చేసినా తక్కువేనన్నారు. మనదేశం టెక్నాలజీ హబ్‌గా మారుతోందని ప్రధాని వివరించారు. డిజిటల్ ఇండియాతో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయన్నారు. 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. జై జై జవాన్, జైకిసాన్, జై విజ్ఞాన్‌తో పాటు జై అనుసంధాన్ అంటూ తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ అంటే ప్రభుత్వ పథకం కాదన్న ప్రధాని మోడీ.. ప్రజలంతా నిలదొక్కుకోవడమే ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యమన్నారు. ప్రతి ఒక్కరు ఆత్మవిశ్వాసంతో బతకాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విదేశాల నుంచి ఆయుధాల కొనుగోలును తగ్గిస్తూ.. మేకిన్ ఇండియాలో భారత్ దూసుకెళ్తోందన్నారు. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ మనదేశంలోనే తయారవుతున్నాయన్నారు. ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం మనకు లేదన్నారు. ప్రపంచ అవసరాల్ని తీర్చే సత్తా భారత్‌కు ఉందని ప్రధాని వివరించారు. మన పిల్లలు విదేశీ వస్తువులతో ఆడకూడదనే సంకల్పం తీసుకుందామన్నారు. ఎరువులు, విద్యుత్ అన్ని రంగాల్లో విదేశాలపై ఆధారపడే పరిస్థితి తగ్గుతోందని ప్రధాని స్పష్టం చేశారు.