ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా రచ్చ జరిగింది.. పలు ప్రాంతాల్లో భారీ విధ్వంసమే జరిగింది.. ఆ పథకాన్ని వెనక్కి తీసుకోవాలంటూ విపక్షాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.. అయితే, కేంద్రం మాత్రం వెనక్కి తగ్గకుండా మరో ముందుడుగు వేసి నోటిఫికేషన్లు కూడా జారీ చేసింది.. ఇక, అగ్నిపథ్‌పై ఆందోళన వ్యక్తం అవుతోన్న సమయంలో.. అగ్నిపథ్, ఆ పథకాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతోన్న ఆందోళనపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. కర్ణాటక పర్యటనలో బిజీగా గడుపుతోన్న ఆయన.. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సంస్కరణలు తాత్కాలికంగా నచ్చకపోయినా.. కాలం గడిచే కొద్దీ వాటి లాభాలను దేశం అందుకుంటుందని తెలిపారు. కొన్ని నిర్ణయాలు అన్యాయంగా అనిపించినా దేశ నిర్మాణానికి ముఖ్యమైనవిగా పేర్కొన్నారు ప్రధాని మోడీ.
Read Also: Sonia Gandhi: ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్.. ఈడీ విచారణకు వెళ్తారా..?
ఈ శతాబ్దపు భారతదేశం సంపద, ఉద్యోగాల సృష్టికర్తలది అన్నారు ప్రధాని మోడీ… నవకల్పనలు కలిగిన వారికీ ఇది సొంతం. ప్రపంచంలో అత్యధిక యువత కలిగిన దేశంగా ఉండడమే భారత్ శక్తి, సంపదగా పేర్కొన్నారు.. గత ఎనిమిదేళ్లలో అంకురాలు, నవకల్పనల మార్గంలో పనిచేయడం సులభంగా జరగలేదన్న ఆయన.. కొన్ని నిర్ణయాలు, సంస్కరణలు తాత్కాలికంగా నచ్చకపోవచ్చు, కానీ, దీర్ఘకాలంలో వాటి లాభాలను దేశం అనుభవిస్తుందన్నారు.. సంస్కరణల మార్గమే మనల్ని కొత్త సంకల్పాలు, కొత్త లక్ష్యాల వైపు తీసుకెళ్తుందని వెల్లడించారు..
ఇక, మైసూరులోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్‌లో ‘కమ్యూనికేషన్ డిజార్డర్స్ ఉన్న వ్యక్తులకు అత్యుత్తమ కేంద్రం’ అనే కోచింగ్ టెర్మినల్‌కు శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. నాగనహళ్లి రైల్వే స్టేషన్‌లో కోచింగ్ టెర్మినల్‌కు శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికలాంగులు ఇతరులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి మా ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తోందన్నారు.. కరెన్సీ నోట్లు మరియు నాణేలలో, వికలాంగుల సౌలభ్యం కోసం కొత్త ఫీచర్లు తీసుకొచ్చామని.. వికలాంగుల విద్యకు సంబంధించిన కోర్సులు కూడా మెరుగుపరచబడుతున్నాయని తెలిపారు.
గత 8 ఏళ్లలో కర్ణాటకలో 5,000 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు 70,000 కోట్ల రూపాయలను మంజూరు చేసిందన్నా ప్రధాని మోడీ.. ఇక, 7,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు బెంగళూరులో ఈరోజు శంకుస్థాపన చేసినట్టు వెల్లడించారు.. బెంగుళూరులో ట్రాఫిక్ జామ్‌లు లేకుండా చేయడానికి, డబుల్ ఇంజన్ ప్రభుత్వం.. రైలు, రోడ్డు, మెట్రో మరియు అండర్‌పాస్, ఫ్లైఓవర్ నిర్మాణంతో సహా సాధ్యమైన అన్ని మార్గాలపై పని చేస్తోందన్నారు.. బెంగళూరులోని సబర్బన్ ప్రాంతాలతో మెరుగైన కనెక్టివిటీని అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు.. 40 ఏళ్ల క్రితమే జరగాల్సిన అభివృద్ధి పనులు పూర్తి చేసే అవకాశం తమకు వచ్చిందన్నారు ప్రధాని మోడీ.. అప్పట్లో ఈ పనులు పూర్తయితే బెంగళూరుపై భారం పెరిగేది కాదన్నారు… అందుకే నేను సమయాన్ని వృథా చేయడం లేదు.. ప్రతి నిమిషం ప్రజలకు సేవ చేయడం కోసం వెచ్చిస్తున్నానని తెలిపారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.