NTV Telugu Site icon

PM Modi: కాంగ్రెస్ మేనిఫేస్టోలో “ముస్లిం లీగ్” ఆలోచనలు.. దేశాన్ని విడగొట్టే యత్నం..

Pm Modi

Pm Modi

PM Modi: నిన్న ప్రకటించిన కాంగ్రెస్ మేనిఫేస్టోపై ప్రధాని నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు. ఆ పార్టీ మేనిఫేస్టో అబద్ధాల మూ అని, ప్రతీ పేజీలో భారత్‌ని ముక్కలు చేసే ప్రయత్నాలే ఉన్నాయని ప్రధాని ఆరోపించారు. శనివారం రాజస్థాన్ లోని అజ్మీర్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడిన పీఏం మోడీ..‘‘ మేనిఫేస్టోలోని కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు స్వాతంత్ర్యానికి ముందు నాటి ముస్లిం లీగ్ ఆలోచనలను పోలి ఉన్నాయి’’ అని అన్నారు. కాంగ్రెస్ తన మేనిఫేస్టో రూపంలో ముసుగు విప్పిందని దుయ్యబట్టారు. కమ్యూనిస్ట్, వామపక్ష ఆలోచనలోత మేనిఫేస్టో నిండి ఉందని అన్నారు.

నేటి కాంగ్రెస్‌కి సిద్ధాంతాలు, విధానాలు లేకుండా పోయాయని ప్రధాని అన్నారు. ఆ పార్టీ అన్నింటిని బయట నుంచి తీసుకున్నట్లు తెలుస్తోందని, అటువంటి పార్టీ దేశ ప్రయోజనాల కోసం ఏం చేస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ భారతదేశాన్ని గత శతాబ్ధంలోకి నెట్టాలని అనునకుంటోందని, కాంగ్రెస్ నారీ శక్తి గురించి ఎప్పుడూ పట్టించుకోలేదని, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి తరతరాలుగా మహిళలు నష్టపోయారని పీఎం అన్నారు. ఏప్రిల్ 19న మీ ఓటు వినియోగించుకుని కాంగ్రెస్‌ని శిక్షించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Read Also: Karnataka: కాంగ్రెస్ నేత ఇంట్లోనే “పాకిస్తాన్” ఉంది.. బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..

మరుగుదొడ్ల నిర్మాణం, ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు, కుళాయి నీరు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం వంటి కార్యక్రమాలను తమ ప్రభుత్వమే చేసిందని ప్రధాని మోడీ అన్నారు. ఆర్మీలో మహిళలకు అవకాశాలు కల్పించింది తమ ప్రభుత్వమే అని, చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత తమకు దక్కుతుందని చెప్పారు. గ్రామాల్లో సైకిల్ తొక్కలేని మహిళలు, ఇప్పుడు డ్రోన్లు ఎగరేస్తున్నారని ప్రధాని చెప్పారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత దేశాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని, 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తామని అన్నారు.

ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలో రెండు విడతల్లో-ఏప్రిల్ 19 మరియు ఏప్రిల్ 26 న ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని మొత్తం 25 ఎంపీ స్థానాలకు గానూ 2019లో బీజేపీ 24 స్థానాలను గెలుచుకుంది. 2014లో 25 స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది.