PM Modi Russia visit: ప్రధాని నరేంద్రమోడీ మరోసారి రష్యా పర్యటనకు వెళ్లబోతున్నారు. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు బ్రిక్స్ సదస్సుకు మోడీ హజరయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ 22-23 తేదీల్లో కాజాన్‌లో జరిగే 16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యాలో పర్యటించనున్నారు. కజాన్‌లో జరిగే బ్రిక్స్ సదస్సు రష్యా అధ్యక్షతన జరుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. తన పర్యటన సందర్భంగా.. ప్రధాని మోడీ బ్రిక్స్ సభ్యదేశాల అధినేతలతో భేటీ కానున్నారు.
‘‘కేవలం గ్లోబల్ డెవలప్మెంట్ మాత్రమే కాకుండా భద్రత, బహూపాక్షికత బలోపేతం చేయడం’’ అనే థీమ్‌తో ఈ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమ్మిట్ కీలకమైన ప్రపంచ సమస్యలను చర్చించడానికి వేదికగా మారుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. బ్రిక్స్ ప్రారంభించిన కార్యక్రమాల పురోగతిని అంచనా వేయడానికి, భవిష్యత్ సహకారం కోసం సమ్మిట్ విలువైన అవకాశాలను అందిస్తుందని చెప్పింది.
Read Also: Royal Enfield Electric Bike: ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది.. వీడియో వైరల్!
BRIC (బ్రెజిల్, రష్యా, భారతదేశం మరియు చైనా) దేశాల నాయకులు 2006లో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో మొదటిసారిగా సమావేశమయ్యారు. ఆ తర్వాత 2010లో సౌత్ ఆఫ్రికా ఈ గ్రూపులో చేరడంతో BRICS (బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా) గా పేరు మార్చబడింది. ఈ కూటమి ప్రపంచ జనాభాలో 41 శాతం, జీడీపీలో 24 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 16 శాతానికి పైగా వాటాని కలిగి ఉంది. ప్రపంచంలో ప్రధాన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్ని ఒక చోట చేర్చే ముఖ్యమైన సమూహంగా ఉంది.
సెప్టెంబర్ నెలలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్, కజాన్‌లో బ్రిక్స్ సదస్సుకి ప్రధాని మోడీకి ఆహ్వానం పంపారు. ఆహ్వానం సందర్భంగా ప్రధాని మోడీ తమకు మంచి స్నేహితుడిగా పేర్కొన్నారు. బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందర్భంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో భేటీ అయిన సందర్భంగా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని కాన్‌స్టాంటైన్ ప్యాలెస్‌లో దోవల్‌తో పుతిన్ సమావేశమయ్యారు. అంతకుముందు ప్రధాని మోడీ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత జూలైలో భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యాకు వెళ్లారు. ప్రస్తుతం మరోసారి వెళ్లబోతున్నారు.