NTV Telugu Site icon

PM Modi US Visit: మోడీ అమెరికా పర్యటనను భగ్నం చేసేందుకు పాకిస్తాన్ కుట్ర.. టూల్ కిట్‌తో ఐఎస్ఐ ప్లాన్

Pm Modi Us Visit

Pm Modi Us Visit

PM Modi US Visit: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా స్టేట్ విజిట్ కు వెళ్తున్నారు. మోడీ పర్యటనకు అమెరికా ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నెల 21 నుంచి 24 వరకు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ ప్రధాని మోడీకి వైట్ హౌజులో ఆతిథ్యం ఇవ్వనున్నారు. దీంతో పాటు మోడీ అమెరికా ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించనున్నారు. ఈ పర్యటన ద్వారా ఇరుదేశాల మధ్య స్నేహంతో పాటు ద్వైపాక్షిక బంధాలు మరింత బలపడనున్నాయి.

ఇదిలా ఉంటే మోడీ అమెరికా పర్యటనపై పాకిస్తాన్ కడుపుమండుతోంది. అక్కడి మీడియా, భారత మీడియా కన్నా ఎక్కువ మోడీ అమెరికా విజిట్ గురించి మాట్లాడుకుంటున్నాయి. భారత్ తమ కన్నా ఎన్నో రెట్లు శక్తివంతమవ్వడం అక్కడి ప్రభుత్వానికి నచ్చడం లేదు. దీంతో కుట్రలు పన్నుతోంది. మోడీ పర్యటన భగ్నం చేసేందుకు పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ టూల్ కిట్లను సిద్ధం చేస్తోంది.ప్రధాని మోదీ అమెరికా పర్యటనను వ్యతిరేకిస్తూ ఐఎస్‌ఐ గత కొన్ని రోజులుగా అమెరికాలో చురుగ్గా వ్యవహరిస్తోంది. సమాచారం ప్రకారం, భారతదేశానికి వ్యతిరేకంగా కుట్రను అమలు చేయడానికి అనేక సంస్థలకు నిధులను కూడా అందించినట్లు తెలుస్తోంది.

Read Also: Chennai: చెన్నైలో దంచికొడుతున్న వానలు.. స్కూళ్లకు సెలవు..

భారత్ పై ప్రపంచ దేశాలకు ముఖ్యంగా అమెరికాకు పెరుగుతున్న నమ్మకంపై పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది. దీంతోనే అమెరికాలో వ్యతిరేక ప్రచారానికి సిద్ధం అవుతోంది. దీంతోనే టూల్ కిట్ సిద్ధం చేసుకుంది. దీంట్లో భారత్ ను ఏవిధంగా వ్యతిరేకించాలో, ఏ ప్రదేశాల్లో నిరసన తెలియజేయాలో ఇప్పటికే ప్రణాళికను పాక్ రూపొందించింది. దీనికి సంబంధించిన సన్నాహాలను పూర్తి చేసింది. ఆందోళనకారులను తీసుకెళ్లేందుకు బస్సుల్ని కూడా సిద్ధం చేసింది. భారత్ పై కుట్రలు చేసేందుకు ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించింది. ప్రధాని మోడీని వ్యతిరేకించేందుకు ఇందులో పేర్లు నమోదు చేసుకోవాలని సూచిస్తోంది.

ఐఎస్ఐ పర్యవేక్షణల్లో ప్రధాని వెళ్లే మార్గంలో పోస్టర్లను అంటించేందుకు కుట్ర జరుగుతోంది. మోడీ నాట్ వెల్కమ్ హ్యాష్ ట్యాగ్ తో నిరసనలకు పిలుపునిచ్చింది. భారత సైన్యం, భారత ప్రభుత్వం మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని, మైనారిటీలను అణిచివేస్తోందని ఆరోపణలు చేస్తోంది.

భారత్ కు సంబంధం లేని సంస్థలు నిరసనల్లో పాల్గొంటున్నాయి. ‘ ఇండో అమెరికన్ ముస్లిం కౌన్సిల్’ ఈ సంస్థలో ఇండియాకు చెందిన ముస్లింలు తక్కువ, పాకిస్తాన్ ముస్లింలు ఎక్కువ. దీనికి నిధులు ఈజిప్టు నుంచి వస్తాయి. ఉగ్రవాదంతో సంబంధం ఉన్నాయి. ‘యాక్షన్ ఫర్ పీస్’ ఈ సంస్థపై నిధుల దుర్వినియోగంపై కేసులు ఉన్నాయి. ‘వెటరన్ ఫర్ పీస్’ వియత్నాం యుద్ధంలో పాల్గొని రిటైర్ అయిన కొంతమంది సైనికులతో ఏర్పడిన ఈ సంస్థ, భారత్ లో హక్కుల హననం జరుగుతోందని ఆరోపిస్తోంది. అయితే ఇది పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, అమెరికాలోని హక్కుల గురించి మాట్లాడకపోవడం విశేషం. ఇలా పలు సంస్థలు ఐఎస్ఐ నిధులతో మోడీ పర్యటనను వ్యతిరేకిస్తున్నాయి.