PM Modi Appeal: ప్రధాని మోడీ ప్రత్యేక విజ్ఞప్తి.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి..

Pmmodi

Pmmodi

PM Modi Appeal: దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఎండల తీవ్రత కారణంగా సాధారణ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నిరంతరం పెరుగుతున్నాయని ప్రధాని తెలిపారు. దీంతో రోజువారీ జీవితంపై తీవ్ర ప్రభావం పడుతోందని, ముఖ్యంగా ఎండ వేడి కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో ప్రజలు శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలని సూచించారు ప్రధాని మోడీ… బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా తాగునీరు వెంట తీసుకెళ్లాలని, వీలైనంత వరకు ఎండలో ఎక్కువసేపు తిరగకుండా జాగ్రత్త పడాలని కోరారు. అలాగే సమాజంలో పరస్పర సహకారం ఎంతో అవసరమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. దాహంతో ఉన్న వారికి ఒక గ్లాస్ నీరు అందించడం కూడా గొప్ప సేవేనని చెప్పారు. ఇళ్ల ముందు, దుకాణాల బయట మట్టికుండల్లో తాగునీరు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టి, ఎవరైనా వచ్చి నీళ్లు తాగేందుకు అవకాశం కల్పిస్తున్న వారిని ప్రధాని అభినందించారు. తీవ్రమైన ఎండల సమయంలో మానవత్వంతో ముందుకు వచ్చి ఇతరులకు సాయం చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్టు పెట్టారు ప్రధాని మోడీ..