ఢిల్లీ ఫలితాల్లో కాంగ్రెస్ జీరో హ్యాట్రిక్ కొట్టిందని ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో బీజేపీ విజయం తర్వాత పార్టీ ప్రధాన కార్యాలయంలో ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. వరుస ఓటముల విషయంలో కాంగ్రెస్‌కు గోల్డ్ మెడల్ ఇవ్వొచ్చు అని తెలిపారు. కాంగ్రెస్ మునిగిపోవడమే కాకుండా.. వారి మిత్రులను కూడా ముంచేస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇండియా కూటమిలోని పార్టీలకు కూడా కాంగ్రెస్ నిజస్వరూపం ఏంటో తెలిసిందన్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలను మిత్రులు కూడా గ్రహించారని మోడీ తెలిపారు.
కోట్లాది మంది మహిళలు ఎన్డీయే ప్రభుత్వ పథకాలతో లబ్దిపొందుతున్నారని తెలిపారు. మోడీ గ్యారెంటీ ఇచ్చాడంటే.. అది నెరవేరి తీరుతుందన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఢిల్లీని అత్యున్నత నగరంగా తీర్చి దిద్దుతామని.. ఢిల్లీ భారత్‌కు ముఖ ద్వారం అని స్పష్టం చేశారు.
‘‘పూర్వాంచల్ ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.. నేను పూర్వాంచల్ నుంచి ఎంపీగా ఉన్నందుకు గర్వపడుతున్నా. దేశ ప్రజలు ఎన్డీయేపై పూర్తి విశ్వాసం చూపిస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. నిజమైన అభివృద్ధిని ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో చూడొచ్చు. బీహార్‌లో నితీష్, ఏపీలో చంద్రబాబుతో కలిసి ఘన విజయం సాధించాం. ఏపీలో చంద్రబాబు తన ట్రాక్ రికార్డును నిరూపించుకున్నారు.’’అని మోడీ అభినందించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 48 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత హస్తినలో కమలం పార్టీ సర్కార్‌ను ఏర్పాటు చేయనుంది. ఇక ఆప్ 22 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక ఓటమిని కేజ్రీవాల్ స్వాగతించారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇక ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఘోర పరాజయం పాలయ్యారు.