PM Modi: పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రసంగానికి ధన్యవాదం తెలుపుతూ ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. స్వాతంత్ర అనంతరం కాంగ్రెస్ బానిస మనస్తత్వం వల్ల దేశం వెనకబడి పోయిందని, గత 10 ఏళ్లలో దేశాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కాంగ్రెస్ ని పుట్టించిందే బ్రిటీష్ వ్యక్తి అని ఎద్దేవా చేశారు. నెహ్రూ రిజర్వేషన్లను వ్యతిరేకించారని ఆరోపించారు.
ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు నిధుల పంపినీ వివాదంపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. నా దేశం అంటే ఒక్క ఢిల్లీ మాత్రమే కాదని, బెంగళూర్, హైదరాబాద్, చెన్నై అతా నాదే అని అన్నారు. ఇండియా అంటే ఒక్క ఢిల్లీ మాత్రమే కాదని జీ20 నేతలకు చాటి చెప్పామని అన్నారు. దేశం అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. రాష్ట్రాలు ఒక అడుగు మందుకేస్తే, తాను రెండు అడుగులు వేస్తానని, ఒక రాష్ట్రంలో సంక్షోభం వస్తే దాని ప్రభావం దేశంపై ఉంటుందని అన్నారు. కరోనా ముందు ప్రపంచం ఓడిన భారత్ గెలిచిందని ప్రధాని చెప్పారు.
కొందరు కావాలనే దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, ప్రతీ రాష్ట్రానికి న్యాయంగా అందాల్సిన నిధులు అందుతున్నాయని, నిధులు కేటాయింపును సంకుచితంగా చూడకూడదని ఆయన చెప్పారు. రాష్ట్రాలపై వివక్ష లేదని, అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తామని తెలిపారు. పేదరికంలో ఉన్న రాష్ట్రాలకు కొన్ని ఎక్కువ నిధులు అవసరమని, మా రాష్ట్రం, మా టాక్స్ అని అంటున్నారు, ఇదెక్కడి వితండవాదం..? అని ప్రశ్నించారు. నది మా రాష్ట్రంలో ప్రవహిస్తుంది, నీళ్లన్నీ మాకే కావాలంటే ఎలా..? అని ప్రశ్నించారు. మా రాష్ట్రంలోనే బొగ్గు ఉంది.. మేమే మాడుకుంటామంటే కుదురుతుందా..? అని ప్రధాని మోడీ ప్రశ్నించారు.
