Amit Shah: ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తప్పకుండా 400కి పైగా స్థానాలను సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఏన్‌డీఏ, ఇండియా కూటమి మధ్య పొంతనే లేదని ఆయన అన్నారు. ప్రతిపక్ష కూటమి విపరీతమైన అవినీతి, కుటుంబ ప్రేమలో మునిపోయిందని ఆయన దుయ్యబట్టారు. ఈ రోజు కర్ణాటకలోని జరిగిన కార్యకర్తల సమావేశంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
తాను దేశవ్యాప్తంగా దాదాపుగా 60 శాతం రాష్ట్రాల్లో పర్యటించానని, ప్రతీ చోటా ప్రజలు మోడీ..మోడీ అంటూ నినాదాలు చేస్తున్నారని ఆయన అన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటక ప్రజలు 43 శాతం ఓట్లు వేసి 17 సీట్లు ఇచ్చారని, 2019లో 51 శాతం ఓట్లు వేసి 25 సీట్లు ఇచ్చారని, ఈసారి 60 శాతం ఓట్లేసి మొత్తం 28 సీట్లను బీజేపీకి ఇవ్వాలని ప్రజలను, పార్టీ కార్యకర్తలను కోరారు.
Read Also: Tata-BMW: బీఎండబ్ల్యూతో టాటా టెక్నాలజీస్ జాయింట్ వెంచర్..
ఒక వైపు 23 ఏళ్లు ముఖ్యమంత్రిగా, ప్రధానిగా పనిచేసిన నరేంద్రమోడీపై ఒక్క అవినీతి ఆరోపణ చేయలేకపోయారని, 23 ఏళ్లుగా మోడీ పారదర్శకతతో దేశంలోనే ఆదర్శంగా నిలిచారని అమిత్ షా అన్నారు. మరోవైపు అహంకార కూటమి ఉందని ఇండియా కూటమిపై విరుచుకుపడ్డారు. మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ హయాంలో 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రూ. 12 లక్షల కోట్ల కుంభకోణాలు, అవినీతి జరిగాయని షా ఆరోపించారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అవినీతిపై ఆయన మండిపడ్డారు. కర్ణాటక ప్రజలు అవినీతిని ఇష్టపడరని అన్నారు.
ప్రధాని మోడీ ఒక్క రోజు సెలవు తీసుకోకుండా, దేశం కోసం పనిచేస్తు్న్నారని, రాహుల్ బాబా వేసవి వచ్చిందంటే విదేశాలకు వెళ్తారని ఎద్దేవా చేశారు. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి కాంగ్రెస్ అతడి కోసం వెతుకుతుందని అన్నారు. ఇద్దరి మధ్య పొంతనే లేదని, దేశం మొత్తం మోడీకి మద్దతుగా నిలుస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నేత బీఎస్ యడియూరప్ప, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, కర్ణాటక ఎన్నికల ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ రాధామోహన్ దాస్ అగర్వాల్, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్.అశోక తదితరులు పాల్గొన్నారు.