Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ

  • భారత్‌లో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ పర్యటన
  • ప్రధాని మోడీతో డెల్సీ రోడ్రిగ్జ్ సమావేశం
  • రెండు దేశాల సంబంధాలపై చర్చ
Modi

Modi

వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భారత్‌లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా రెండు దేశాల సంబంధాలు మరింత బలపడ్డాయి. గురువారం ప్రధాని మోడీతో ఢిల్లీలో డెల్సీ రోడ్రిగ్జ్‌ భేటీ అయ్యారు. ఇంధన భద్రత, ముడి చమురు దిగుమతులు, వాణిజ్యం, పెట్టుబడులు వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచ చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్న నేపథ్యంలో భారత్ తన ముడి చమురు దిగుమతుల వనరులను విస్తరించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో వెనిజులాతో ఇంధన సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించింది.

×
×
Ad

ఐదు రోజుల భారత పర్యటనలో భాగంగా ఢిల్లీకి వచ్చిన డెల్సీ రోడ్రిగ్జ్‌తో జరిగిన సమావేశంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కూడా పాల్గొన్నారు. ఇంధన భద్రతతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, ఔషధాలు, ఆరోగ్యరంగం, రవాణా, పునరుత్పాదక ఇంధన రంగాల్లో సహకారాన్ని విస్తరించే అవకాశాలను పరిశీలించారు. అంతకుముందు విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా డెల్సీ రోడ్రిగ్జ్‌ను ప్రత్యేకంగా కలిశారు. భారత్-వెనిజులా సంబంధాల అభివృద్ధికి ఆమె అందిస్తున్న సహకారం అమూల్యమని ప్రశంసించారు.

ఒకప్పుడు వెనిజులా నుంచి రోజుకు 4 లక్షల బ్యారెళ్లకు పైగా ముడి చమురును భారత్ దిగుమతి చేసుకునేది. అయితే అమెరికా ఆంక్షల కారణంగా 2020 తర్వాత దిగుమతులు భారీగా తగ్గిపోయాయి. ఇటీవల ఆంక్షల సడలింపుల తర్వాత భారత్ మళ్లీ వెనిజులా చమురును కొనుగోలు చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారత చమురు మార్కెటింగ్ సంస్థలు వెనిజులా నుంచి దిగుమతులను గణనీయంగా పెంచుతున్నాయి.

ఇంధన రంగంలో రెండు దేశాల మధ్య ఇప్పటికే బలమైన భాగస్వామ్యం ఉంది. ఓఎన్‌జీసీ విదేశ్ లిమిటెడ్, వెనిజులాకు చెందిన చమురు సంస్థ CVPతో కలిసి ‘‘పెట్రోలెరా ఇండోవెనెజోలానా SA’’ పేరుతో సంయుక్త ప్రాజెక్టును నిర్వహిస్తోంది. శాన్ క్రిస్టోబల్ చమురు క్షేత్రంలో ఈ భాగస్వామ్య సంస్థ చమురు అన్వేషణ, ఉత్పత్తి కార్యకలాపాలు చేపడుతోంది.

డెల్సీ రోడ్రిగ్జ్‌తో పాటు వెనిజులా విదేశాంగ, ఆర్థిక, సాంకేతిక, సమాచార, రవాణా శాఖల మంత్రులు కూడా భారత పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనతో భారత్-వెనిజులా వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడే అవకాశం ఉందని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి.