India vs Canada: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. ఈ హత్యవెనక భారత్ ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంట్ లో ఆరోపించడం వివాదాస్పదమైంది. అంతేకాకుండా అగ్రశ్రేణి భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరించింది. దీనికి ప్రతిగా భారత్ కూడా కెనడా సీనియర్ దౌత్యవేత్తను 5 రోజుల్లో భారత్ వదిలి వెళ్లాలని ఆదేశించింది. కెనడా వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధ, ప్రేరేపిత వ్యాఖ్యలని భారత్ ఖండించింది.
ఇదిలా ఉంటే రెండు రోజులుగా ఇరుదేశాల మధ్య ఏర్పడిన దౌత్య ఉద్రిక్తతలను గురించి ప్రధాని మోడీ ఆరా తీశారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ లోనే విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తో ఆయన భేటీ అయ్యారు. కెనడా సమస్యలపై జైైశంకర్ ప్రధాని మోడీకి వివరించినట్లు సమాచారం.
Read Also: Women Reservation Bill: “మీరు ఎంపీలను చంపడానికి ప్రయత్నించారు”.. సోనియాగాంధీపై బీజేపీ ఎంపీ ఆరోపణలు..
సోమవారం కెనడా పార్లమెంట్ లో ఆ దేశ ప్రధాని ట్రూడో మాట్లాడుతూ.. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత ఏజెంట్ల హస్తం ఉందని ఆరోపించారు. ఈ ఏడాది జూన్ నెలలో కెనడాలోని సర్రే ప్రాంతంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు హర్దీప్ సింగ్ నిజ్జర్ ని కాల్చి చంపారు. ఈ హత్యపై కెనడా దర్యాప్తు ఏజెన్సీలు విచారణ చేస్తున్నాయని ట్రూడో అన్నారు.
భారత్ నుంచి పంజాబ్ ని వేరు చేసి ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలనే ఖలిస్తాన్ ఉగ్రమూకలు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ఇందుకు కెనడా వేదిక అవుతోంది. పలుమార్లు భారత్ కెనడాకు తన అభ్యంతరాన్ని తెలియజేసింది. అయినా అక్కడి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కెనడా నెలను భారత వ్యతిరేఖ చర్యలకు ఉపయోగించవద్దని కోరింది. ఖలిస్తాన్ రెఫరెండం పేరుతో పలుమార్లు ఓటింగ్ నిర్వహించారు వేర్పాటువాదులు. ఇటీవల జీ20 సమావేశానికి వచ్చిన ట్రూడోతో కూడా ప్రధాని నరేంద్రమోడీ తన తీవ్ర అభ్యంతరాన్ని లేవనెత్తారు.