ఒకటి కాదు రెండు కాదు.. వంద కోట్ల టీకాలు భారతజాతి ప్రపంచానికి చాటిన ఐక్యతా అంశం. ‘మన్ కీ బాత్’ 82 వ రేడియో ఎడిషన్‌లో ఈరోజు జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ కీలక ప్రసంగం చేశారు. 100 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోస్‌లు ఇవ్వడం భారతదేశ శక్తిని అందరికీ చూపించిందన్నారు మోడీ. కరోనాపై పోరులో ఇదో మైలురాయి అని ప్రధాని మోడీ అన్నారు. వ్యాక్సిన్లు అందరికీ అందిస్తామన్నారు. అసాధ్యం అని భావించిన ఈ విజయం తర్వాత దేశం కొత్త ఉత్సాహంతో.. కొత్త శక్తితో.. ముందుకు సాగుతోందన్నారు.
మనమంతా ఐక్యంగా ఉంటే ఎవరూ మనల్ని ఏమీ చేయలేరని అన్నారు. సంస్కృతి, మూలాల గురించి గర్వపడేలా బిర్సా ముండా మనకు నేర్పించారని కొనియాడారు. అలాగే, పోలీసు, భద్రతా దళాల్లో మహిళల సంఖ్య పెరుగుతుండటం చాలా సంతోషకరమైన విషయం అని ప్రధాని మోడీ అన్నారు. కరోనాపై పోరు, టీకా కార్యక్రమాల గురించి మోడీ ప్రస్తావించారు. ఆరోగ్య కార్యకర్తలు అద్భుతంగా పనిచేశారని కితాబిచ్చారు.
‘సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మనకు ఐక్యత సందేశాన్ని అందించారు. ఆయన చూపిన మేరకు కార్యాచరణలో మనమందరం తప్పనిసరిగా చేరాలి. యురీ నుంచి పఠాన్‌కోట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం ద్వారా జమ్ముకశ్మీర్ పోలీసు సిబ్బంది ఐక్యతా సందేశాన్ని ఇచ్చారు.
మన ఐక్యతతోనే దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లగలమని సర్దార్ చెప్పేవారు. మనలో ఐక్యత లేకపోతే మనం కొత్త విపత్తుల్లో చిక్కుకున్నట్లే భావించాలి’ అన్నారు మోడీ. ప్రధాని మోడీ ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్‌కు చెందిన మహిళా ఆరోగ్య కార్యకర్త పూనం నౌటియాల్‌తో మాట్లాడారు. టీకా సమయంలో ఆమె ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు.
దేశంలో విజయవంతమైన వ్యాక్సినేషన్ ప్రక్రియ భారత శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటిందన్నారు. అక్టోబర్ 31న జరగనున్న జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు ప్రధాని. ప్రజలందరూ దేశ ఐక్యతను చాటి చెప్పే విధంగా మంచి పని చేయాలన్నారు.