ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆది, సోమవారాల్లో జరిగే జీ-7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. ఆయన ఇప్పటికే జర్మనీ చేరుకున్నారు. జర్మనీలోని మ్యునిఖ్ ఎయిర్‌పోర్టులో ఆయనకు అక్కడి అధికారులు ఘనస్వాగతం పలికారు. జర్మనీలో జరిగే జీ-7 సదస్సులో ఆయన పాల్గొననున్నారు. జీ-7 దేశాలతో పాటు అతిథి దేశాల అధినేతలు ఇందులో పాల్గొని ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై చర్చిస్తారు. జర్మనీ ఛాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్ ఆహ్వానం మేరకు ఈ సదస్సుకు మోదీ హాజరవుతున్నారు.
జర్మనీలోని మ్యునిఖ్‌లో నేటి సాయంత్రం ఓ కమ్యూనిటీ కార్యక్రమంలోనూ ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. జర్మనీ పర్యటన ముగించుకున్న అనంతరం ప్రధాని మోదీ యూఏఈకి వెళ్లనున్నారు. గల్ఫ్ దేశ మాజీ అధ్యక్షుడు షేక్ ఖలీఫా ఇటీవలే మరణించినందున.. వారి కుటుంబసభ్యులను మోదీ పరామర్శించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా మానవత్వాన్ని ప్రభావితం చేస్తున్న కీలక అంశాలపై అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్ సహా అర్జెంటీనా, ఇండోనేసియా, సెనెగల్, దక్షిణాఫ్రికా తదితర ప్రజాస్వామ్య దేశాలను సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న జర్మనీ ఆహ్వానించిందని శనివారం ఓ ప్రకటనలో మోదీ తెలిపారు. సదస్సులో పాల్గొనే జీ-7, భాగస్వామ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో పర్యావరణం, విద్యుత్తు, ఆహార భద్రత, ఆరోగ్యం, ఉగ్రవాదం, లింగ సమానత్వం, ప్రజాస్వామ్యం తదితర అంశాలపై చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు, నేడు జర్మనీ నుంచే రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌లో మోదీ మాట్లాడనున్నారు.
An early morning touchdown in Munich…
PM @narendramodi will participate in the G-7 Summit.
Later this evening, he will also address a community programme in Munich. pic.twitter.com/firI9zI3yo
— PMO India (@PMOIndia) June 26, 2022