Cabinet Meeting: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర మంత్రివర్గం కీలక భేటీ కాబోతోంది. న్యూఢిల్లీలోని సేవా తీర్థ్‌లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రారంభానికి ముందు మోడీ కేబినెట్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ భేటీలో చర్చలు, తీసుకునే నిర్ణయాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
దీనికి ముందు లోక్‌సభ, రాజ్యసభ తిరిగి సమావేశపరచాలని కేంద్ర ప్రభుత్వం కోరినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గురువారం వెల్లడించారు. లోక్‌సభ నవంబర్ 30న సమావేశం కానుంది. రాజ్యసభ డిసెంబర్ 2న సమావేశం కానుంది. ఉభయసభల సమావేశాలు డిసెంబర్ 3 వరకు కొనసాగే అవకాశం ఉంది.
మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులో మార్పులపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లును నవంబర్ 30న లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై కాంగ్రెస్ కూడా దృష్టి పెట్టింది. తన వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా నవంబర్ 27న సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ టీమ్ సమావేశం కాబోతోంది. ఈ సమావేశానికి సోనియా గాంధీ అధ్యక్షత వహించనున్నారు.

