Pinarayi Vijayan: 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘‘ది కేరళ స్టోరీ’’ సినిమాకు రెండు ప్రధాన అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులు ప్రకటించని కొన్ని గంటల్లోనే కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు అవార్డులు ఇచ్చి కేరళ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశారని ఆరోపించారు. ఇలాంటి చిత్రాన్ని సత్కరించడం ద్వారా కేంద్రం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని సీఎం అన్నారు.
ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డులను ‘‘ది కేరళ స్టోరీ’’ గెలుచుకుంది. ఈ సినిమా కేరళలో జరుగుతున్న లవ్ జిహాద్, మతమార్పిడులు, ఐసిస్ ఉగ్రవాద సంస్థ కోసం రిక్రూట్ చేయడం వంటి వివాదాస్పద అంశాలను చర్చించింది. ఈ సినిమా విడుదలను కూడా ఆ సమయంలో కేరళ సీఎం, అధికార కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. నటి అదా శర్మ నటించిన ఈ సినిమాను దర్శకుడు సుదీప్తో సేన్ తెరకెక్కించారు.
Read Also: AIIMS Study: పడక సుఖం కోసం మందులు వాడుతున్న యువత.. సంచలన రిపోర్ట్..!
సంఘ్ పరివార్ భావజాలానికి కేంద్రం చట్టబద్ధత ఇస్తోందని విజయన్ ఎక్స్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కేరళ ప్రతిష్టను దెబ్బతీసే, మత విద్వేషానికి బీజాలు వేసే స్పష్టమైన ఉద్దేశ్యంతో స్పష్టమైన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే చిత్రాన్ని సత్కరించడం ద్వారా, జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీ సంఘ్ పరివార్ విభజన భావజాలానికి చట్టబద్ధతను కల్పించింది’’ అని ఆరోపించారు.
‘‘మతపరమైన శక్తులకు వ్యతిరేకంగా సామరస్యం, ప్రతిఘటనకు ఎల్లప్పుడూ నిలయంగా నిలిచిన కేరళను ఈ నిర్ణయం తీవ్రంగా అవమానించింది. కేవలం మలయాళీలు మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ సత్యాన్ని, మనం ఎంతో ఆదరించే రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి తమ స్వరాన్ని పెంచాలి’’ అని విజయన్ అన్నారు. కేరళ సీఎం వ్యాఖ్యల్ని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వి. శివన్ కుట్టి కూడా సమర్థిస్తూ, ఇది జాతీయ అవార్డుల విలువను తగ్గిస్తాయని అన్నారు.
