NTV Telugu Site icon

PhonePe: సీఎంపై కాంగ్రెస్ పోస్టర్లు.. లీగల్ యాక్షన్ తీసుకుంటామన్న ఫోన్ పే

Phone Pe

Phone Pe

PhonePe: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య ఇప్పుడే ప్రచారం ఊపందుకుంది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ గతంలో కర్ణాటక ఎన్నికల్లో అవలంభించిన స్ట్రాటజీనే వాడుతోంది. మధ్యప్రదేశ్ లో కూడా సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ పోస్టర్లు వేశారు. అయితే ఇది కాంగ్రెస్ పార్టీకే ఎదురుతిరిగింది. ఈ పోస్టర్ల కోసం కాంగ్రెస్ ప్రముఖ ఫిన్‌టెక్ సేవల సంస్థ ‘ఫోన్ పే’ లోగోను వాడింది. దీంతో వివాదం మొదలైంది.

ఫోన్ పే లోగో, క్యూఆర్ కోడ్స్ ఉంటున్నాయి. వీటిపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఫోటోలను ముద్రించింది కాంగ్రెస్ పార్టీ. ఈ చిత్రాలను ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ.. రాష్ట్రంలో పని జరగాలంటే 50 శాతం కమీషన్ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని విమర్శలు గుప్పించింది. ఇటువంటి పోస్టర్లు చింద్వారా, రేవా, సత్నా మరియు రాష్ట్ర రాజధాని నగరం భోపాల్‌లో కూడా కనిపించాయి. ఆ తరువాత అధికారులు వీటిని తొలగించారు.

Read Also: CARE Hospitals : కేర్ ఆస్పత్రిలో విజయవంతంగా క్వాడ్రాఫుల్ కరోనరీ బైపాస్ సర్జరీ

అయితే దీనిపై ఫోన్ పే ఘాటుగానే స్పందించింది. మా బ్రాండ్ లోగోను దుర్వినియోగం చేస్తున్నారు.. దీన్ని వ్యతిరేకిస్తున్నామని, మాకు ఏ రాజకీయ పార్టీలో సంబంధం లేదని, దీనిపై చట్టపరమైన చర్యయలు తీసుకుంటామని హెచ్చరించింది. మా బ్రాండ్ లోగో మరియు రంగును కలిగి ఉన్న పోస్టర్‌లు మరియు బ్యానర్‌లను తీసివేయమని మేము మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌ని వినమ్రంగా అభ్యర్థిస్తున్నామని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

ఈలోగా, పోస్టర్లు అతికించిన గుర్తు తెలియని వ్యక్తులపై పడవ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది మరియు పోలీసులు వారి కోసం వెతుకుతున్నారు. తన పార్టీ పరువు తీస్తున్నారని బీజేపీ కార్యకర్త ఫిర్యాదు చేశారని, దాని ఆధారంగా గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని గ్వాలియర్ ఎస్పీ రాజేష్ సింగ్ చందేల్ తెలిపారు.