బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో క్వాడ్రాఫుల్ కరోనరీ బైపాస్ సర్జరీని విజయవంతంగా నిర్వహించినట్లు ఆస్పత్రి మీడియా వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. కేర్ ఆస్పత్రి కార్డియాక్ విభాగం డైరెక్టర్ డాక్టర్ ప్రతీక్ భట్నాగర్ నేతృత్వంలో వైద్య బృందం.. 50 ఏళ్ల రోగి హేమంత్ కు కేవలం ధమని అంటుకట్టులను ఉపయోగించి నాలుగు రెట్ల కరోనరీ బైపాస్ సర్జరీని చేశారు. హేమంత్ గతంలో తన ఎడమ ప్రధాన కరోనరీకి స్టంట్ లను వేయించుకున్నారు కూడా, అయితే మూడు నెలల్లోనే అడ్డంకి ఏర్పడింది.
ఢిల్లీకి చెందిన హేమంత్, ఛాతి నొప్పితో బాధపడుతూ గతంలో ఢిల్లీలోనే కరోనరి యాంజియోగ్రఫీ చేయించుకున్నారు. ఈ వైద్య పరీక్షలో అతని ఎడమ ప్రధాన, ఇతర కరోనరీ ధమనుల్లో అడ్డంకులు ఉన్నట్లు వెల్లడైంది, దీంతో వైద్యులు సెంట్లు వేశారు. అయితే మూడు నెలల్లోనే మరలా చాతి నొప్పి తలెత్తడంతో అతను బంజారా హిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో వైద్య చికిత్స పొందాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో హేమంత్ బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ ప్రతీక్ భట్నాగర్ ను సంప్రదించారు. ఇక్కడ సైతం కరోనరీ యాంజియోగ్రఫీ వైద్య పరీక్షలు చేశారు. మూడు నెలల వ్యవధిలోనే స్టంటులలో అడ్డంకులను గమనించిన డాక్టర్ ప్రతీక్.. రోగి ప్రాణాపాయ స్థితిని అంచనా వేశారు. దీంతో రోగికి నాలుగు రెట్ల క్వాడ్రాఫుల్ కరోనరీ బైపాస్ సర్జరీ చేయాలని నిర్ణయించారు. వెంటనే డాక్టర్ ప్రతీక్ నిపుణులైన వైద్య బృందంతో కలిసి రోగికి ఆ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఎలాంటి కాలు కోతలు, ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండానే క్వాడ్రాఫుల్ కరోనరీ బైపాస్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. సర్జరీ అనంతరం 36 గంటల్లోనే రోగి నడవగలగడమే కాక మెట్లను సైతం ఎక్కే శక్తిని పొందారు. ఈ క్రమంలో వైద్యులు రోగిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.
డాక్టర్ ప్రతీక్ భట్నాగర్ మాట్లాడుతూ, ద్వైపాక్షిక అంతర్గత క్షీరథ ధమని (బీఐఎంఏ) సాంకేతికత ఉపయోగించి చేసే మొత్తం ధమనుల కరోనరీ బైపాస్ శస్త్ర చికిత్స.. కరోనరీ ఆర్టరీ అడ్డంకులు ఉన్న రోగులకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుందని తెలిపారు. ప్రామాణిక కరోనరీ బైపాస్ సర్జరీలో బీఐఎంఏ సాంకేతికతతో నిర్వహించే ఈ విధానం వల్ల ప్రమాదం 1 శాతం కంటే తక్కువ అన్నారు. ఈ విధానం ఉత్తమమైనదని, రోగులు భయపడకుండా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోవాలని సూచించారు. రోగి హేమంత్ మాట్లాడుతూ ప్రస్తుత ఆరోగ్య స్థితి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కేర్ ఆస్పత్రిని ఎంచుకొని మంచి పని చేశారని అన్నారు. కేర్ ఆస్పత్రి హెచ్ సి ఓ ఓ నీలేష్ గుప్తా మాట్లాడుతూ, తమ ఆసుపత్రి ద్వారా అధునాతన సాంకేతికత కలిగిన శస్త్ర చికిత్సలను రోగులకు చేరువచేశామన్నారు. మా తరపున రోగులకు నాణ్యమైన వైద్య సంరక్షణ అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు