మరోసారి గ్యాస్ ధరలు పెరిగాయి.. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు ఢిల్లీలో రూ. 105 పెరగగా.. కోల్‌కతాలో రూ. 108 పెరిగింది.. ఇక, 5 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర కూడా 27 రూపాయలు పెరిగింది… కొత్త రేట్లు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి.. మార్చి 1వ తేదీన సబ్సిడీ లేని 14 కిలోల సిలిండర్ (ఎల్పిజి గ్యాస్ సిలిండర్) ధర మాత్రం పెరగలేదు. అయితే, దీని వెనుక కూడా ఓ లాజిక్ వెతుకుతున్నారు.. ఇంకా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తిస్థాయిలో ముగియకపోవడంతో.. వ్యూహాత్మకంగా కేంద్రం అడుగులు వేస్తోంది.. కానీ, పోలింగ్ ముగిసిన వెంటనే రెండు మూడు నెలలుగా స్థిరంగా ఉన్న పెట్రో ధరలు ఒక్కసారిగా భగ్గుమంటాయని అంచనా వేస్తున్నారు.. లీటర్ పెట్రోల్‌పై ఏకంగా రూ.10 వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గిపోతున్నా.. దేశంలో మాత్రం పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతూపోయిన కేంద్ర ప్రభుత్వం.. ఉత్తరప్రదేశ్‌తో పాటు ఐదు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాటికి బ్రేక్ వేసింది.
Read Also: Russia-Ukraine War: ఒంటరి అవుతున్న రష్యా
అయితే, ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజలపై పెనుభారం మోపడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి.. ఇందుకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) నడుపుతున్న కన్జ్యూమర్ బంకులు, సర్వీస్ పెట్రోల్ బంకుల(డీలర్స్ నడిపేవి) ధరల మధ్య వ్యత్యాసమే నిదర్శనమని పరిశీలకులు పేర్కొంటున్నారు. సాధారణంగా సర్వీస్ పెట్రోల్ బంకులతో పోల్చితే కన్జ్యూమర్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు లీటర్‌కు రూ. 3-5 వరకు తక్కువగా ఉంటాయి. కానీ, గత రెండు మూడు నెలలుగా సర్వీస్ బంకుల్లో ధర స్థిరంగా ఉండగా కన్జ్యూమర్ బంకుల్లో మాత్రం పెరుగుతూనే ఉన్నది. ఇక, ఐదు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే మునుపటి మాదిరిగా కేంద్ర ప్రభుత్వం రోజువారీగా పెట్రో బాంబ్ పేల్చే అవకాశం ఉంది.. ఇందుకు ముడి చమురు ధరలు, తాజాగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని బూచిగా చూపించే అవకాశం ఉందంటున్నారు.. పెట్రోలు, డీజిల్ ధర లీటరుపై కనీసం రూ.10 పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు..