NTV Telugu Site icon

Delhi New CM: ఢిల్లీ సీఎం రేసు నుంచి తప్పుకున్న పర్వేష్ వర్మ! కారణమిదే!

Parvesh Verma

Parvesh Verma

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు 10 రోజులైంది. 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ప్రధాని మోడీ రెండు దేశాల పర్యటన కోసం ఫ్రాన్స్, అమెరికా వెళ్లారు. దీంతో ముఖ్యమంత్రి ఎంపిక వాయిదా పడింది. అయితే మూడ్రోజుల క్రితం మోడీ విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. ఇక ముఖ్యమంత్రి ఎంపిక అంశంపై సోమవారం శాసనసభా పక్ష సమావేశం ఉంటుందని ప్రకటించారు. అనూహ్యంగా హైకమాండ్ గురువారానికి వాయిదా వేసింది. అంటే 20న ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం ఉంటుందని అంతా భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Call Merging Scam: యూపీఐ యూజర్లకు బిగ్ అలర్ట్.. కాల్ మెర్జ్ చేస్తున్నారా? మీ ఖాతా ఖాళీ అవుతుంది జాగ్రత్త!

ఇదిలా ఉంటే నిన్నామొన్నటిదాకా ఢిల్లీ ముఖ్యమంత్రిగా న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు ప్రముఖంగా వినిపించింది. ఢిల్లీ సీఎం ఆయనేనంటూ ప్రచారం జరిగింది. కానీ సోమవారం అంచనాలన్నీ తారుమరయ్యాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి రేసు నుంచి పర్వేష్ వర్మ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో ఏ రాష్ట్రంలోనూ బీజేపీ మహిళా ముఖ్యమంత్రులు లేరు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పీఠంపై మహిళకు ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. అంతేకాకుండా మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో మాదిరిగా ఢిల్లీలో కూడా తొలిసారి ఎన్నికైన అభ్యర్థినే ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టాలని హైకమాండ్ ఆలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో దాదాపుగా పర్వేష్ వర్మ ముఖ్యమంత్రి రేసు నుంచి తప్పుకున్నట్లేనని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆయన మద్దతుదారుల్లో ఆశలపై నీడలు కమ్ముకున్నట్లు సమచారం.

ప్రముఖంగా ముఖ్యమంత్రి రేసులో రేఖ గుప్తా పేరు వినిపిస్తోంది. మహిళకు ఛాన్స్ ఇస్తే గనుక ఈమెను ఎంపిక చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేశారు. అలాగే బీజేవైఎం ఢిల్లీ యూనిట్ కార్యదర్శిగా ఉండటంతో పాటు కౌన్సిలర్‌గా, ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా కూడా ఉన్నారు. ఇవన్నీ ఆమెకు కలిసొచ్చే అంశాలుగా కనబడుతున్నాయి. అలాగే జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్‌లకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన ఆశిష్ సూద్, అలాగే శిఖా రాయ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ ఉత్కంఠకు తెరపడాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy : ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్ కఠిన చర్యలు.. ఉచిత ఇసుక సరఫరాకు ప్రత్యేక కమిటీ