Parliament: 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!.. 2 కీలక బిల్లులు ప్రవేశపట్టే అవకాశం

  • 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
  • 2 కీలక బిల్లులు ప్రవేశపట్టే అవకాశం
  • నీట్, ఆయోద్యపై హాట్‌ హాట్‌గా జరిగే ఛాన్స్
Parliament

Parliament

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఆగస్టు 13 వరకు సుమారు మూడు వారాల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నట్లు సమాచారం. ఈ సమావేశాల్లో మొత్తం 19 సిట్టింగ్స్ నిర్వహించే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే దీనిపై క్యాబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్ (CCPA) తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సాధారణంగా వర్షాకాల, శీతాకాల సమావేశాలు నాలుగు వారాల పాటు జరిగి 20 సిట్టింగ్స్ ఉంటాయి. అయితే గతంలో కొన్ని సందర్భాల్లో తక్కువ రోజులపాటు సమావేశాలు నిర్వహించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి.

హాట్‌హాట్‌గా..

అయితే ఈ వర్షాకాల సమావేశాలు హాట్‌హాట్‌గా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయోధ్య రామమందిర విరాళాల స్కామ్‌పై దుమారం చెలరేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరిలో బీజేపీ విజయాల అనంతరం జరుగుతున్న తొలి పార్లమెంట్ సమావేశాలు ఇవి. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే వర్గం)లో చోటుచేసుకున్న తిరుగుబాట్లు కూడా సమావేశాల్లో చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది.

టీఎంసీకి చెందిన 20 మంది, శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు తమను ప్రత్యేక గ్రూపులుగా గుర్తించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. ఈ విజ్ఞప్తిపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అలాగే తిరుగుబాటు చేసిన ఎంపీలకు లోక్‌సభలో సీట్ల కేటాయింపుపై కూడా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇక రాజ్యసభలో కొత్తగా ఎన్నికైన, తిరిగి ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడంతో అధికార ఎన్డీఏ కూటమి బలం మరింత పెరిగింది.

కీలక బిల్లులు

వర్షాకాల సమావేశాల్లో ఎన్డీఏ ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా రెండు రాజ్యాంగ సవరణ బిల్లులను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు (మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన)ను సవరణలతో మళ్లీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ బిల్లులో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల సభ్యుల సంఖ్యను 50 శాతం పెంచే ప్రతిపాదన కూడా ఉండొచ్చని సమాచారం.

ఒకే దేశం-ఒకే ఎన్నిక బిల్లుపై కమిటీకి ఇచ్చిన గడువు పొడిగింపుకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎఫ్‌సీఆర్‌ఏకు సంబంధించిన వివాదాస్పద సవరణలు కూడా సమావేశాల్లో వచ్చే అవకాశముంది. అదనంగా వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు, యాంటీ డోపింగ్ సంస్కరణలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు, కార్పొరేట్ చట్ట సంస్కరణలు, సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్ వంటి బిల్లులను కూడా ప్రభుత్వం ఆమోదం కోసం ప్రవేశపెట్టే అవకాశముంది.

ప్రతిపక్షం వ్యూహం

ఇక ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని పలు అంశాలపై నిలదీయడానికి సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా..

నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం
అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలు
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల
ద్రవ్యోల్బణం
నిరుద్యోగ సమస్య

వంటి అంశాలపై కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఈసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తీవ్ర రాజకీయ వాగ్వాదాలకు వేదిక కానున్నాయి.