Rahul Gandhi: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యపై లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రిని చంపాలనే ఉద్దేశంతోనే అప్పట్లో ఆయనకు ఉన్న భద్రతను తొలగించారని, అది అనుకోకుండా జరిగిన పొరపాటు కాదని రాహుల్ వ్యాఖ్యానించారు. తన తల్లి సోనియాగాంధీ రాసిన జ్ఞాపకాల పుస్తకం ‘బిలాంగింగ్’ (Belonging) గురించి సోనియా, సోదరి ప్రియాంక గాంధీలతో కలిసి మాట్లాడిన ఒక ప్రత్యేక వీడియోలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
బీహార్ పర్యటనలోనే హెచ్చరించా..
1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత ప్రధాని బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ, 1989 ఎన్నికల్లో ఓటమిపాలై ప్రతిపక్ష నేతగా మారారు. ఆ సమయంలో ఆయనకున్న కమాండో భద్రతను తగ్గించడంపై రాహుల్ గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 1991 నెలలో శ్రీపెరంబదూర్లో జరిగిన ఆత్మాహుతి దాడికి ముందు రాజీవ్ గాంధీతో కలిసి బీహార్ ఎన్నికల ప్రచారానికి రాహుల్ కూడా వెళ్లారు. ఆ పర్యటన అత్యంత భయానకంగా సాగిందని సోనియా గాంధీ గుర్తుచేసుకున్నారు. ఓపెన్ టాప్ జీపులో ప్రచారం చేస్తున్న సమయంలో కొందరు రాళ్లు విసిరారని, ఆయన భద్రత విషయంలో అప్పటి బీహార్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఆ పర్యటన తర్వా త రాహుల్ నాతో ..‘‘అమ్మా, నాన్న భద్రత విషయంలో మనం ఏదో ఒకటి చేయకపోతే, త్వరలోనే ఆయన అంత్యక్రియలకు రావాల్సి వస్తుంది’’ అని చెప్పినట్లు సోనియా గాంధీ గుర్తుచేసుకున్నారు.
తండ్రిని చంపడానికే భద్రత తొలగించారు..
రాహుల్ గాంధీ ఆ సమయంలో ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దికాలానికే 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబదూర్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడిలో హత్య చేశారు. దీనిపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీహార్ పర్యటన నా అనుమానాలను నిజం చేసిందని, నాన్నను చంపడానికే భద్రతను తొలగించారని, అది యాదృచ్ఛికం కాదని, పక్కా ప్రణాళికతో హత్యకు అనుకూలమైన వాతావరణ సృష్టించారని ఆరోపించారు. ఈ విషయంపై తాను అమ్మతోనే కాదు, నాన్నతో కూడా వాదించినట్లు రాహుల్ పేర్కొన్నారు.

