Site icon NTV Telugu

Pakistan Spy: పంజాబ్‌లో పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్.. ఖలిస్తాన్ ఉగ్రవాదితో సంబంధాలు..

Arrest

Arrest

Pakistan Spy: భారతదేశంలో వరసగా పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తున్న వారు పట్టుబడుతున్నారు. ఇప్పటికే హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసింది. ఇదిలా ఉంటే, పంజాబ్‌లో మరో పాకిస్తాన్ గూఢచారి దొరికాడు. పాక్ కోసం గూఢచర్యం చేస్తున్న గగన్‌దీప్ సింగ్‌ని పంజాబ్ పోలీసులు తరన్‌తరన్‌లో అరెస్ట్ చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సరిహద్దుల వెంబడి ఆర్మీ కదలికలకు సంబంధించిన సున్నిత సమాచారాన్ని పాకిస్తాన్ గూఢచారం సంస్థ ఐఎస్ఐకి అందించారనే ఆరోపణలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా సరిహద్దు వెంబడి భారత సైన్యానికి సంబంధించిన వివరాలను ఇతను పాకిస్తాన్‌కి చేరవేస్తున్నాడు.

గగన్‌దీప్ సింగ్ గత5 ఏళ్లుగా పాకిస్తాన్‌కు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది గోపాల్ సింగ్ చావ్లాతో సంప్రదింపులు జరుపుతున్నాడని, ఇతని ద్వారా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్(PIOలు)కి పరిచయం అయ్యాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇతడికి భారతీయ మార్గాల ద్వారా PIOల నుంచి డబ్బులు అందుకున్నాడని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ మంగళవారం తెలిపారు.

Read Also: YSRCP vs TDP: టీడీపీకి చెందిన పెళ్లి బృందంపై వైసీపీ కార్యకర్తల దాడి..!

పాకిస్తాన్ నాన్‌కానా సాహిబ్‌కి చెందిన ఖలిస్తానీ అనుకూల నాయకుడు గోపాల్ సింగ్ చావ్లా తరుచుగా భారత వ్యతిరేకతను ప్రదర్శిస్తుంటాడు. మతపరమైన కార్యక్రమాల్లో పాకిస్తాన్‌ని సందర్శించేందుకు వచ్చే భారతీయుల్లో సాఫ్ట్ టార్గెట్స్‌‌ని గుర్తించే బాధ్యతను ఐఎస్ఐ చావ్లాకు అప్పగించింది. జమాత్ ఉద్ దావా, లష్కరే తోయిబా చీఫ్ హఫీస్ సయీద్‌తో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసి చావ్లా మొదటిసారిగా వెలుగులోకి వచ్చాడు.

జాతీయ భద్రతకు ముప్పు కలిగించే సమాచారాన్ని గగన్ ఐఎస్ఐకి అందించే వాడని, వ్యూహాత్మక ప్రదేశాల వివరాలను పంచుకున్నట్లు దర్యాప్తులో తేలిందని డీజీపీ చెప్పారు. గగన్ గత 5 ఏళ్లుగా చావ్లాతో సంప్రదింపులు జరుపుతున్నాడని వెల్లడించారు. పాకిస్తాన్‌కి సమాచారం అందించిన మొబైల్ ఫోన్‌ను, అలాగే 20ఎక్కువ ఐఎస్ఐ కాంటాక్ట్స్ వివరాలను పంజాబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గూఢచార నెట్వర్క్‌ని ఛేదించడానికి దర్యాప్తు జరుగుతోంది. గగన్‌కి ముందు 2019లో జలంధర్ పోలీసులు భటిజా గ్రామానికి చెందిన హర్పాల్ సింగ్ పాలాను అరెస్ట్ చేశారు. ఇతను ఐఎస్ఐ ఏజెంట్ చావ్లాకు కీలకమైన వ్యూహాత్మక సమాచారాన్ని అందించారు.

Exit mobile version