Site icon NTV Telugu

India Pakistan War: మధ్య ఆసియా దేశం నుంచి భారత్ దాడి చేసే ఛాన్సుందా..? పాకిస్తాన్‌లో కొత్త భయం..

Farkhor Air Base

Farkhor Air Base

India Pakistan War: పహల్గామ్ ఉగ్రదాడి దాయాదుల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్తాన్ రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు మాత్రం మేము భారత్‌ని ధీటుగా ఎదుర్కొంటామని బీరాలు పలుకున్నారు. తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు, ఎంత గంభీరంగా బయటకి కనిపిస్తున్నా, పాక్ నాయకత్వంలో భారత్ అంటే భయం ఉందని తెలుస్తోంది.

ఇప్పటికే, బలూచి‌స్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా వంటి సంక్షోభ ప్రాంతాల నుంచి పాక్ తన ఆర్మీని భారత సరిహద్దుల వైపు పంపించింది. ఏ క్షణాన భారత్ దాడి చేస్తుందో అని పాక్ ఎదురుచూస్తోంది. అయితే, ఇప్పుడు పాకిస్తాన్‌ని మరో అనుమానం వేధిస్తోంది. మధ్య ఆసియా దేశమైన తజకిస్తాన్‌లో భారత్‌కి మిలిటరీ బేస్ ఉంది. అక్కడి వైమానిక స్థావరం నుంచి దాడులు జరుగుతాయేమో అని పాక్ ప్రభుత్వం తెగ భయపడి పోతోంది. భారత్ వైపు తూర్పు సరిహద్దుల్లో పాకిస్తాన్ బలంగా ఉన్నప్పటికీ, ఆఫ్ఘనిస్తాన్‌ని అనుకుని ఉన్న పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్తాన్ అంత స్ట్రాంగ్‌‌గా లేదు. 2011లో అమెరికా, పాకిస్తాన్‌లోని అబోట్టాబాద్‌లో దాగి ఉన్న ఒసామా బిన్ లాడెన్‌ని హతమార్చిన సమయంలో పశ్చిమ సరిహద్దు గుండానే యూఎస్ ఆర్మీ పాక్‌కి తెలియకుండా ప్రవేశించింది. ఇదే స్ట్రాటజీ భారత్ అవలంభిస్తే ఎలా అని పాక్ భయపడుతోంది.

Read Also: Rajnath Singh: ‘‘ప్రధాని గురించి మీరందరికి తెలుసు’’ యుద్ధంపై రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..

పాకిస్తాన్ పక్కనే ఉన్న తజకిస్తాన్‌లో భారత్‌కి వైమానిక స్థావరం ఉందని చాలా మందికి తెలియదు. ఇది పీఓకే నుంచి 600 కి.మీ దూరంలోనే ఉంది. భారత్ గత 30 ఏళ్లుగా తజకిస్తాన్‌లో తన సైనిక ఉనికిని కొనసాగిస్తోంది. 1990లలో ఆఫ్ఘన్ సరిహద్దుకు సమీపంలో దక్షిణ తజకిస్తాన్ లోని ఫార్ఖోర్ ప్రాంతంలో భారత సైన్యం ఒక మిలిటరీ ఆస్పత్రిని స్థాపించింది. ఆ సమయంలో తాలిబాన్ దళాలతో పోరాడుతున్న నార్తర్న్ అలయన్స్ యోధులకు వైద్య సహాయం అందించింది.

ఆఫ్ఘనిస్థాన్ నుంచి సోవియట్ యూనియన్ వైదొలిగిన తర్వాత ఆ దేశంలో తీవ్ర అంతర్యుద్ధం జరిగింది. ఒక వైపు పాక్ మద్దతుతో దక్షిణ, తూర్పు ఆప్ఘనిస్తాన్‌పై తాలిబన్లు ఆధిపత్యం చెలాయించారు. అదే సమయంలో నార్తర్న్ అలియన్స్ ఎదురుదాడి చేసింది. ఈ సమయంలో ఫార్ఖోర్ లో భారత్ కీలక పాత్ర పోషించింది. ఈ యుద్ధ సమయంలోనే ఆఫ్ఘన్-తజక్ గెరిల్లా కమాండర్ అహ్మద్ షా మసౌద్ 2001లో ఆత్మాహుతి దాడిలో తీవ్రంగా గాయపడిన సందర్భంలో ఫార్ఖోన్‌లో భారత్ మిలిటరీ ఆస్పత్రిలోనే చికిత్స పొందాడు. కానీ అతడు మరణించాడు. ఇప్పుడు, పహల్గాం ఉద్రిక్తతల మధ్య ఈ మిలిటరీ బేస్ కీలకంగా మారుతుందా..? అనే భయం పాక్‌లో నెలకొంది.

Exit mobile version