Pakistan: పాకిస్తాన్ తన ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, కీలక ఉగ్రవాదులను రక్షించాలనేదే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంతో పాటు భారత్ కోరుతున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులకు పాక్ స్వర్గధామంగా ఉంది. వారిని జాతీయ ఆస్తులుగా పాకిస్తాన్ భావిస్తోంది. ముఖ్యంగా, ఏడుగురు టెర్రరిస్టులను దాయాది దేశం రక్షిస్తోంది. వీరందరూ భారత్ తో పాటు విదేశాల్లో అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడి పదుల సంఖ్యలో ప్రాణాలు తీశారు. పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వీరందరిని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది.
1) హఫీజ్ సయీద్:
1990ల ప్రారంభంలో పాకిస్తాన్ కేంద్రంగా ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ మిషనరీ గ్రూప్ ‘‘మర్కజ్-ఉద్-దవా-వాల్-ఇర్షాద్’’ అనే సైనిక విభాగాన్ని స్థాపించాడు. ఇదే ‘‘లష్కరే తోయిబా’’ ఉగ్రవాద సంస్థ. 2006 ముంబై రైలు పేలుళ్లు, ముంబైపై 26/11 దాడులకు బాధ్యత వహించింది. ఈ రెండు దాడుల్లోనే ఏకంగా 360 మందికి పైగా మరణించారు. 2000 ఢిల్లీ ఎర్రకోటపై కూడా ఈ ఉగ్రసంస్థ దాడులు చేసింది. అమెరికా, ఐక్యరాజ్యసమితి ఇతడిని ఉగ్రవాదిగా గుర్తించింది. ఇతడి తలపై 10 మిలియన్ డాలర్ల బహుమతి ఉంది. కానీ, హఫీజ్ సయీద్ మాత్రం లాహోర్‌లో హాయిగా నివసిస్తున్నాడు.
2) మసూద్ అజార్:
భారత్ కోరుతున్న మరో కరుడుగట్టిన ఇస్లామిక్ ఉగ్రవాది, ‘‘జైషే మహ్మద్’’ చీఫ్ మసూద్ అజార్ కూడా పాకిస్తాన్‌లో సంతోషంగా ఉన్నాడు. పాక్ సైన్యం ఇతడిని రక్షిస్తోంది. పుల్వామా ఎటాక్, యూరీ సంఘటనలకు ఇతడే బాధ్యుడు. ఈ దాడుల్లో 59 మంది సైనికులు మరణించారు. 2019లో ఐక్యరాజ్యసమితి ఇతడిని గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించింది. అయితే, పాక్ మాత్రం ఎప్పటిలాగే మసూద్ అజార్ ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదని చెబుతోంది.
3) జకీర్ రెహ్మాన్ లఖ్వీ:
లష్కరే తోయిబాలో కీలక వ్యక్తి జకీర్ రెహ్మాన్ లఖ్వీని కూడా భారత్ ఎప్పటి నుంచో కోరుతోంది. ఇతను ఉగ్రవాద సంస్థ సైనిక అధికతి, 26/11 ముంబై ఉగ్రదాడులకు రూపశిల్పి. ముంబై దాడిలో ఇతర ప్రమేయానికి సంబంధించి సాక్ష్యాలను భారత్ ఇప్పటికే పాకిస్తాన్‌కి సమర్పించింది. 2020లో పాకిస్తాన్ ‘‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్)’’ గ్రే లిస్టులో ఉన్న సమయంలో ఇతను ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొన్నాడు.
4) సయ్యద్ సలావుద్దీన్:
కరుడుగుట్టిన ఉగ్రవాదుల్లో సయ్యద్ సలావుద్దీన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇతను హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ అధిపతి. ఇతను గతంలో భారత దేశంలోని కాశ్మీర్ లోయను ‘‘భారత భద్రతా దళాలకు స్మశానవాటిగా మారస్తా’’ అంటూ భయపెట్టే ప్రయత్నం చేశాడు. అమెరికా విదేశాంగ శాఖ, భారత్ జాతీయ దర్యాప్త సంస్థ(ఎన్ఐఏ) ఇతడిని ఉగ్రవాదిగా ప్రకటించాయి. ఆక్రమిత కాశ్మీర్‌లో భారత వ్యతిరేక ర్యాలీలకు ఇతనే నాయకత్వం వహిస్తాడు.
5) దావూద్ ఇబ్రహీం:
ఒకానొక సమయం ముంబైని ఏలిని అండర్ వరల్డ్‌కి ‘‘ దావూద్ ఇబ్రహీం’’ కింగ్‌లా ఉన్నాడు. డీ-కంపెనీ క్రైమ్ సిండికేట్ అధిపతి అయిన ఇతను హత్య, కిరాయి హత్యలు, దోపిడీలు, డ్రగ్స్, ఉగ్రవాదం వంటి అనేక ఆరోపణలు ఉన్నాయి. 1993 ముంబై పేలుళ్లకు దావూద్ ఇబ్రహీం ప్రధాన సూత్రధారి అని భావిస్తున్నారు. ఆ పేలుళ్లలో 257 మంది మరణించారు. భారత్, అమెరికా 2003లో ఇతడిని గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించాయి. అమెరికా ఎఫ్‌బీఐ ఇతడిని మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉంచింది. ఇతడిపై 25 మిలియన్ డాలర్ల బహుమతి ఉంది. దావూద్ ఇబ్రహీం కరాచీలోని అత్యంత విలాసమంతైన ప్రాంతం, సైనిక కేంద్రంగా ఉన్న కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తోంది.
6-7) ఇక్బాల్ భత్కల్-రియాజ్ భత్కల్:
ఇండియన్ ముజాహీదిన్ ఉగ్రవాది ఇక్బాల్ భత్కల్ కూడా పాకిస్తాన్ లో ఆశ్రయం పొందుతున్నాడు. ఇతని సోదరుడు రియాజ్ భత్కల్ కూడా పాకిస్తాన్ కరాచీలో ఉన్నారు. వీరిద్దరూ భారత్‌లో స్లీపర్ సెల్స్‌ని నిర్వహిస్తున్నారు.
