Site icon NTV Telugu

Bilawal Bhutto Zardari: “బిన్ లాడెన్ చనిపోయాడు.. కానీ..” ప్రధాని మోదీపై పాక్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. భారత్ ఆగ్రహం

Pakistan

Pakistan

Pakistan Foreign Minister’s Controversial Comments on Prime Minister Modi: భారత ప్రధాని నరేంద్రమోదీపై పాకిస్తాన్ విదేశాంగశాఖ మంత్రి బిలావల్ భుట్టో జర్ధారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూఎన్ భద్రతా మండలిలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడాన్ని తూర్పారపట్టారు. ఒసామా బిన్ లాడెన్ వంటి ఉగ్రవాదికి పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చిందని.. ఇటువంటి దేశం ఉగ్రవాదంపై నీతులు చెబుతుందని విమర్శించారు.

ఇదిలా ఉంటే జైశంకర్ చేసిన ఈ వ్యాఖ్యలపై పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో మాట్లాడుతూ.. ‘‘ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడు, అయితే గుజరాత్‌లోని కసాయి బ్రతికున్నాడని, అతను భారత ప్రధాని అని నేను భారతదేశానికి చెప్పాలనుకుంటున్నాను’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. నరేంద్రమోదీ ప్రధాని అయ్యేంత వరకు అమెరికా ఈ దేశంలోకి రాకుండా నిషేధించిందని.. ఆర్ఎస్ఎస్ ప్రధాని, ఆర్ఎస్ఎస్ విదేశాంగ మంత్రి అంటూ మోదీ, జైశంకర్ లను విమర్శించాడు. ఆర్ఎస్ఎస్ హిట్లర్ నుంచి స్ఫూర్తి పొందిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

Read Also: Crime News: కూతురిపై కన్నతండ్రి అత్యాచారం.. గర్భం దాల్చడంతో దారుణం.. చివరికి

ఇదిలా ఉంటే ఈ వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ మరోసారి అధమ స్థితికి చేరుకుందని.. అనాగరిక ప్రేలాపన చేస్తోందని విదేశాంగ శాఖ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. 1971లో బంగ్లాదేశ్ లోని బెంగాలీలు, హిందువులపై జరిగిన మారణహోమాన్ని పాకిస్తాన్ మరిచిపోయిందని, పాక్ పాలకులు సాగించిన మారణ హోమం కనిపించడం లేదని మైనారిటీల పట్ల పాక్ తీరు మారడం లేదని విమర్శలు గుప్పించారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ. ముంబై, న్యూయార్క్, లండన్, పఠాన్ కోట్, పుల్వామా దాడులు అన్నీ పాకిస్తాన్ కేంద్రంగానే జరిగాయాని అన్నారు. ఒసామా బిన్ లాడెన్‌ను అమరవీరుడని కీర్తిస్తూ, లఖ్వీ, హఫీజ్ సయీద్, మసూద్ అజార్, సాజిద్ మీర్ , దావూద్ ఇబ్రహీం వంటి ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశం పాకిస్థాన్ అని కేంద్ర మంత్రి మీనాక్షీ లేఖీ విమర్శించారు. బిలావల్ భుట్టో వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీ ముందు ఆందోళన నిర్వహించారు.

Exit mobile version