Site icon NTV Telugu

Pakistan: భారత్ లక్ష్యంగా, పాకిస్తాన్ ఆర్మీ “రాకెట్ ఫోర్స్” ఏర్పాటు..

Pak

Pak

Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాకిస్తాన్ భారత్‌ను ఎదుర్కొనే పనిలో పడింది. పహల్గామ్ దాడి తర్వాత, భారత్ జరిపిన ప్రతీకార చర్యలో పాకిస్తాన్ దారుణంగా భంగపడింది. 11 ఎయిర్ బేసులపై భారత్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇదే కాకుండా పీఓకే, పాకిస్తాన్ భూభాగాల్లో ఉన్న లష్కరేతోయిబా, జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

అయితే, ఈ దాడుల తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం ‘‘రాకెట్ ఫోర్స్ కమాండ్’’ ఏర్పాటు చేయనుంది. పాక్ సైన్యం చీఫ్ అసిమ్ మునీర్ నేతృత్వంలో ఈ ఫోర్స్ రూపుదిద్దుకుంటున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. లాంగ్ రేంజ్ స్ట్రైక్ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్(సీడీఎఫ్) అసిమ్ మునీర్ అధ్యక్షతన ఇటీవల జరిగిన కార్ప్స్ కమాండర్ల సమావేశంలో ఈ రాకెట్ ఫోర్స్ కమాండ్‌కు ఆమోదం లభించింది. రాబోయే కొన్ని నెలల్లో దీనిని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయబోతున్నారు.

Read Also: Samsung Republic Day Sale 2026: ఆఫర్లు బాబోయ్ ఆఫర్లు.. ఈ స్మార్ట్‌ టీవీ కొంటే రూ.93 వేల సౌండ్‌బార్ ఫ్రీ!

పాకిస్తాన్ రాకెట్ ఫోర్స్ కమాండ్, 2015లో చైనా స్థాపించిన రాకెట్ ఫోర్స్ ఆధారంగా రూపుదిద్దుకుంటోంది. ఈ కమాండ్‌కు లెఫ్టినెంట్ జనరల్(త్రీస్టార్) లేదా మేజర్ జనరల్ (టూ స్టార్) హోదా కలిగిన సీనియర్ పాక్ ఆర్మీ అధికారి నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ ప్రయోగించిన డ్రోన్లను, క్షిపణులు భారత ఎయిర్ డిఫెన్స్ సమర్థవంతంగా అడ్డుకుంది. ఇక భారత్ ప్రయోగించిన క్షిపణులను పాకిస్తాన్ వద్ద ఉన్న చైనీస్ డిఫెన్స్ నిలువరించలేకపోయింది.

ఇదిలా ఉంటే, భారత్ కూడా శక్తివంతమైన రాకెట్ ఫోర్స్‌ను సృష్టించాలనుకుంటున్నట్లు సమాచారం. అయితే, అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. చైనా, పాక్ సరిహద్దుల్లో ఎదురవుతున్న భద్రతా సవాళ్ల దృష్ట్యా భారత్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ భారతదేశ సాయుధ దళాలను ఆధునీకరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. యుద్ధ స్వరూపం మారుతున్న నేపథ్యంలో ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, హైపర్‌సోనిక్స్, రోబోటిక్స్ వంటి టెక్నాలజీతో సైన్యాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యాన్ని ఆయన వెల్లడించారు.

Exit mobile version