Site icon NTV Telugu

Pakistan Army: పాకిస్తాన్ ఆర్మీకి వేల కోట్లలో వ్యాపారాలు.. వ్యవసాయం దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ దాకా..

Pak Army

Pak Army

Pakistan Army: అన్ని దేశాలకు సైన్యం ఉంటుంది, కానీ పాకిస్తాన్ విషయంలో మాత్రం ఓ సైన్యానికి దేశం ఉందని చెప్పవచ్చు. భారత్ వంటి దేశాల్లో మిలిటరీ చీఫ్‌లుగా పని చేసిన వారు రిటైర్మెంట్ తర్వాత సాధాసీదా జీవితం గడుపుతారు. కానీ పాకిస్తాన్‌లో అలా కాదు మిలిటరీలో చేరితే జాక్‌పాట్ కొట్టినట్లు, ప్రభుత్వమే పదుల నుంచి వందల ఎకరాల భూమిని ఆర్మీలో పనిచేసిన వారికి ఇస్తుంది. ఇక అవినీతికి కొదువ లేదు. పాక్ ఆర్మీ చీఫ్‌లుగా పనిచేసినవారు తమ రిటైర్మెంట్ తర్వాత హాయిగా లండన్, దుబాయ్, ఖతార్‌ వంటి ప్రాంతాల్లో కుటుంబాలతో సెటిల్ అవుతారు. ఆ తర్వాత పాకిస్తాన్‌ వైపు కన్నెత్తి చూడరు.

పాకిస్తాన్ దేశ రక్షణ, యుద్ధం తప్పా అన్ని వ్యాపారాలు చేస్తోంది. పాకిస్తాన్ వ్యాప్తంగా మొత్తం వ్యాపార సామ్రాజ్యం పాక్ ఆర్మీ చేతిలోనే ఉంది. వ్యవసాయం దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ వరకు పాక్ ఆర్మీదే రాజ్యం. చివరకు నిత్యావసర వస్తువుల్లో కూడా ఆర్మీ హస్తం ఉంటుంది. సిమెంట్, ఎరువులు, బ్యాంకింగ్, పాడి పరిశ్రమ, రవాణా, గృహ నిర్మాణం అంతా ఆర్మీ చేతిలోనే. ప్రస్తుతం, వార్తల్లో హాట్ టాపిక్‌గా ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ బహిరంగ ఆస్తులే రూ. 6 కోట్ల (ఇండియన్ రూపాయలు) ఉన్నాయి. ఇక విదేశాల్లో, బినామీల పేర్లలో ఎన్ని ఆస్తులు ఉన్నాయో లెక్కే లేదు. సూటిగా చెప్పాలంటే పాక్ ఆర్మీ ఆ దేశంలో 100కి పైగా వ్యాపారాలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం వ్యవసాయంలోకి దిగింది. చోలిస్థాన్ ఎడారి ప్రాంతంలో పెద్ద కెనాల్‌లను నిర్మించి, సింధు నది నీటిలో వ్యవసాయం చేయాలనుకుంటోంది.

Read Also: GT vs SRH: మ్యాచ్ గెలిచి ప్లేఆఫ్ రేసులో ఎస్ఆర్ఎచ్ నిలుస్తుందా? మొదట బ్యాటింగ్ చేయనున్న జీటి

పాక్ ఆర్మీ వ్యాపార సామ్రాజ్యం:

పాకిస్తాన్ సైన్యం రక్షణతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ భాగాన్ని నియంత్రిస్తుంది. నిజానికి ఇది ప్రజా ప్రభుత్వాన్నే శాసిస్తుంది. ఆర్మీ చెప్పిందే అక్కడి ప్రభుత్వాలకు వేదం. పాక్ ఆర్మీ ఫౌజీ ఫౌండేషన్, ఆర్మీ వెల్ఫేర్ ట్రస్ట్, షాహీన్ ఫౌండేషన్, బహ్రియా ఫౌండేషన్ వంటి సంస్థలను నిర్వహిస్తుంది. ఇది పెద్ద కార్పొరేట్ నెట్వర్క్.

ప్రసిద్ధ రచయిత్రి ఆయేషా సిద్ధిఖా రాసిన ‘‘మిలిటరీ ఇంక్.: ఇన్‌సైడ్ పాకిస్తాన్స్ మిలిటరీ ఎకానమీ’’ పుస్తకంలో పాక్ వ్యాపార సామ్రాజ్యం గురించి అన్ని వివరాలు ఉన్నాయి. కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ ప్రాంతాల్లో పాక్ ఆర్మీ పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్నే స్థాపించింది. డిఫెన్స్ హౌసింగ్ అథారిటీ (DHA) పేరుతో పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థను రన్ చేస్తోంది. దీని విలువ బిలియన్ డాలర్లలో ఉంది. అయేషా సిద్దిఖీ ప్రకారం, 2007లోనే పాకిస్తాన్ వ్యాపార దందా విలువ 20 బిలియన్ డాలర్లు. ఇప్పుడు దీని విలువ 40-100 బిలియన్ డాలర్లు( భారత కరెన్సీలో రూ. 80,000 కోట్లు)గా ఉండొచ్చు.

Exit mobile version